పుట:Aananda-Mathamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దియవ ప్రకరణము

47


మనుష్యులు కుక్కలను నక్కలను తిందురు! చచ్చిన పీనుఁగులను తిందురు! ఏదేశమున గుప్తముగా ధనమును దాఁచి యుంచినను రక్షకము లేకున్నది! పెండ్లాము బిడ్డలకుఁ గూడ నెమ్మది లేదు; కడుపులోని శిశువునకుఁగూడ నెమ్మది లేదు. ఇంతకంటె అన్యాయము వేఱేమున్నది? ఏ దేశమందు రాజులు ప్రజారక్షణము చేయకున్నారు? అదియే ఉభయులకుఁగల సంబంధము. అది లేనప్పుడు పరస్పర సంబంధ మేమున్నది? మనదేశమునందు రాజు ప్రజలను సంరక్షించుచున్నాఁడా! ధర్మము పోయెను, జాతి పోయెను, మానము పోయెను. కులము పోయెను, ఇఁక ప్రాణముకూడ పోనున్నది. ఈ దుర్మార్గులను తఱిమి వేయక గాని హిందువులు హిందువులుగా నుండుటకు సాధ్యముకాదు.

మహేంద్ర—— వారిని దేశమునుండి తఱిమివేయుట యెట్లు? ఆపని చేయువా రెవరు?

భవానంద —— నేనే.

మహేంద్ర ——నీవు ఒక్కఁడవే తఱిమి వేయుదువా? ఒక్కనిచేత నేమగును?

ఆమాటను విని, భవానందుఁడు మరల గీతములు పాడఁ దొడంగెను.

“సప్తకోటి కణ్ఠకలకలనినాదక రాలే
ద్విసప్తకోటిభుజై ర్ధతఖరకరవాలే”

ఇట్టి మహామాతను ఎవరు అబల యని చెప్పుదురు?

మహేంద్ర——అయినను, నీవు ఒక్కఁడవే కదా ?