Jump to content

పుట:Aananda-Mathamu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

ఆనందమఠము

చుండెను. ఈమెయే శాంతి; జీవానందుని కళేబరమును వెదకుచుండెను.

శాంతి ఏడ్చుచు పొరలాడుచుండిన సమయమునందు, అతి మధురమైన సకరుణధ్వనిచే, “ఏడ్చువా రెవరు? లేవమ్మా! యేడ్వవలదు” అని చెప్పిన మాటలను విని, శాంతి తిరిగి చూడఁగా నెదుట నాజ్యోత్స్నాలోకంబునందు వెనుక నెపుడు చూడని జటాజూటధారియైన పురుషుఁడు నిలిచి యుండెను.

శాంతి ఏడ్చుచు లేచి నిలువంబడెను. వచ్చిన మహాపురుషుఁడు “ఏడ్వవలదమ్మా! జీవానందుని దేహమును నేను వెదకి యిచ్చెదను, నాతోరమ్ము” అనియెను.

అప్పు డతఁడు శాంతిని రణక్షేత్ర మధ్యస్థలంబునకుఁ బిలిచికొని పోయెను. అచ్చట అసంఖ్యేయములగు శవరాసులొకదానిపై నొకటిగా పడియుండెను. శాంతిచేత దానిని కదలించుటకు కాకపోయెను. ఆ బలిష్ఠుండగు మహాపురుషుఁడు దానినంతయుఁ దీసి యొకశవమును వెలికిఁ దీసెను. దానినిఁ గాంచి శాంతి జీవానందుని దేహమని గుర్తించెను. సర్వాంగమును గాయములచే రక్తమయమై యుండెను. శాంతి చూచి సామాన్య స్త్రీవలె విలపింప నారంభించెను.

ఆ మహాపురుషుఁడు, మరల “ఏడ్వవలదమ్మా! జీవానందుఁడు చావలేదు. స్థిరముగా నతని దేహమును పరీక్షించి చూడుము, మొదట నాడిని పట్టిచూడుము” అనియెను.

శాంతి శవము యొక్క నాడినిబట్టి చూచెను. కొంచెమైనను గతి లేదు. ఆ పురుషుఁడు “ఱొమ్ముపై చేయి నిడి చూడు” మనియెను.