ఈ పుట ఆమోదించబడ్డది
160
ఆనందమఠము
భవానంద —— (సాశ్రులోచనుఁడై) పంపెదను. నేను చచ్చిన పిదప నన్ను జ్ఞాపకము చేసికొనియెదవా?
కల్యాణి —— వ్రతచ్యుతుఁడైన అధర్మివని జ్ఞాపకము జేసికొందును.
భవానందుఁడు వెడలి పోయెను. కల్యాణి పుస్తకమును జదువుచుఁ గూర్చుండి యుండెను.
ముప్పదియవ ప్రకరణము
భవానంద ధీరానందుల సంవాదము
భవానందుఁ డాలోచనా క్రాంతుఁడై మఠమునకు వెడలెను. పోవుచుండఁగాఁ బొద్దు క్రుంకెను. అడవియం దొక్కఁడే పోవుచుండెను. అచ్చట నెవఁడో యొకఁడు ముందు పోవు చుండెను. భవానందుఁ ‘డెవరది’ యని యడిగెను.
అగ్రగామి —— అడుగువా రెవరు? తెలిసినచో నుత్తర మిచ్చెదను. నేను పథికుఁడను.
భవానంద —— వందే.
అగ్రగామి —— మాతరం.
భవానంద —— నేను భవానంద గోస్వామిని.
అగ్రగామి —— నేను ధీరానందుఁడను.
భవానంద —— ధీరానందా! ఎచటికిఁ బోయి యుంటివి?