పుట:Aananda-Mathamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

11


ముకొఱకై రొక్క మిచ్చి తీసికొనిరి. జనులకు తినుటకు అన్నము లేకపోయెను. మొదట ఒకపూట ఉపవాసము చేయుటకు ప్రారంభించిరి. ఆకాలమున మహమ్మద్ రేజఖా౯ అనువాఁడు పన్ను వసూలు చేయు అధికారిగా నుండెను. వాఁడీసమయమున సర్కారు వారికి అధికాదాయము కనఁబఱిచి తాను వారి దయకు పాత్రుఁడు కావలయునని తలంచి మామూలుపన్ను కంటే నూటికి పదిరూపాయలు ఎక్కువ శిస్తు విధించినాఁడు. ఇందువలన బంగాళా దేశమంతయు అల్లకల్లోలముగ నుండెను.

జనులు బిచ్చ మెత్తుటకు ప్రారంభించిరి. దుర్భిక్ష కాలమున భిక్షము పెట్టువా రెవరు? ఆనంతరము ఉపవాసము చేయు చుండిరి. పదంపడి రోగములకు పాలైరి. తర్వాత గొడ్డుగోదలను విక్రయించిరి. ఆవల నాఁగళ్లు మొదలైన వ్యవసాయోపకరణములను అమ్మిరి. అటుపిమ్మట, విత్తనములకై యుంచు కొనియుండిన ధాన్యమును తినిరి తదనంతరము నేలలు ఇండ్లు విక్రయించిరి. ఆమీఁద నగలను, గుడ్డలను విక్రయించిరి. తుదకు భార్యలను బిడ్డలను సైతము విక్రయించిరి ఇంకేమి మిగిలి యున్నది? ఏదియు లేదు. అయినను, పెండ్లాము బిడ్డలను విక్రయించినను కొనువారు లేరు వారిని పోషించుటకు మార్గమేది? అందఱును విక్రయించువారేయైరి. తీసుకొనువారు మాత్రము లేరు. అన్నము లేక ఆకు లలములు తినుట కుపక్రమించిరి. పచ్చిగడ్డిని, పశువులను, పక్షులను, కుక్కలను, నక్కలను, పిల్లు లను, ఎలుకలను, ఉడుతలను, పందికొక్కులను తినిరి. అన్నియు తినియైనవి. మిగిలిన దేదియు లేదు, ఇఁక నేమి చేయవచ్చును?