పుట:2030020025431 - chitra leikhanamu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దట్టము చేయవలెను. ముఖ్యముగ నిప్పుడు మొదట వేసిన రంగులను శుభ్రపఱుచుటయే ప్రధానమైనపని. ఈవిధముగ చర్మపురంగు నభివృద్ధిపఱిచి జుట్టును చిత్రించుటకు పూనుకొనవలెను. ఇదివఱకు వేసినరంగులను సిపియాతోను, న్యూట్రలు టింటు (Neutral Tint) తోను అభివృద్ధిపఱిచి వెండ్రుకలను ప్రదర్శింపవలెను.

వెండ్రుకల సమూహమును వాటిమెఱపును చక్కగ చిత్రించవలసియుండును. కనుక విద్యార్థి యీవిషయమై మిక్కిలి శ్రద్ధ వహించియుండుట మంచిది. మొదట బరంటుశయనారంగు గలవెండ్రుకలను చిత్రించువిషయమై చెప్పెదను. దీనికి వేండిక్కుబ్రౌనురంగును, సిపియాను కలుపవలెను. వేయునప్పుడు విస్తారము గీతలుగాను లేక యేకముగాను వేయగూడదు. కొంచెము కొంచెము గీతలుగా నుండవలెను. కొంచెము మెఱయునప్పుడు చిన్నగీతలు మాత్రము కానవచ్చును. మెఱయుచోటునందు పలుచని నీలిరంగును వేయవలెను. దానిమీదను చర్మపురంగును వేసి సిపియాతోను వేండిక్కు బ్రౌనురంగుతోను వెండ్రుకలను చిత్రింపవలెను. నల్లని వెండ్రుకలకు మొదట సిపియాను, నీలినివేసి ఇండిగోరంగును, క్రిమిజనులేకును, సిపియాను కలిపి నలుపు రంగును తయారుచేసి ఛాయ యున్న చోటులయందు వేసికొనిరావలెను. నలుపువెండ్రుకలు మెఱయుచోటునందు నీలిని వేయుడు.

మఱియొకవిధముగ జుట్టును చిత్రించవచ్చును. ప్రథమమున సిపియాను వేసి వేండిక్కుబ్రౌనురంగును సిపియాను కలిపి ఛాయ నివ్వవలెను. తరువాత గోపిచందనపురంగును, ఇండియాపసుపును, తేలికయైనఎఱుపును వేయవచ్చును. ఇట్టివెండ్రుకలు మెఱయుచోట పసుపును వేసి ఛాయను గ్రేవర్ణముతో నివ్వవలెను. ఈవిషయము నిటుల నుంచివేసి మెడను, చేతులను చిత్రించుట మంచిది.

చర్మమునకును, వెండ్రుకలకును మధ్యనుండు స్థలమునకు గ్రేవర్ణమును వేయవలెను. ఈరెంటికిని విస్తారము భేదమును కనబఱుపకూడదు. జుట్టుయొక్క అంచులకును యీరంగునే వేయవలెను. లేనియెడల ప్రతిమవలె నుండును కాని, జీవకళను కలిగియుండదు.

ప్రథమమున చర్మపురంగు వేసి వెలుతురు గలచోటున నీలిని, ఛాయయందు తేలికయైన ఎఱుపురంగును, నీలిని కలిపివేయవలెను. ఈవిధముగనే చేతులకును, ఇతరస్థలములకును రంగులను వేయవలెను. వేళ్లకు భేదమును చూపుటకు మధ్యను వేండిక్కుబ్రౌనురంగును, గులాబిరంగును వేయుట మంచిది. వ్రేళ్లకీరంగులు సౌందర్యము నిచ్చును. వ్రేళ్లకొనలును, వ్రేళ్లకణుపులును, అఱచేతులును ఇతరస్థలములకంటె కొంచెము గులాబిరంగుగ నుండును. అందువలన నీస్థలములకు గులాబిరంగును, వెర్మిలియను రంగును వేయవలెను.

పిమ్మట బట్టలకు ఏకముగ నొకేరంగును వేయవలెను. ఛాయ నిప్పు డిచ్చుట యవసరములేదు.

మూడవతరగతి:- ఇప్పుడు కాగిత మంతయు రంగులతో నిండియున్నది. చిత్రములయొక్క రూపు కొంతవఱకు తేలెను. కాని యింతటితో సరిపోలేదు. ముఖముగుండ్రముగ కనబడుటకు ఇంకను రంగులను వేయవలెను. ఛాయను కనపఱుపవలెను. పూర్తిచేయుటయే మిగిలియున్నది.

నీచిత్రమును కొంచెము దూరమునుండి చూడుము. ఎచ్చటెచ్చట రంగులను వేయవలయునో నీకే తెలియును. మీదినుండి (అనగా: కంటివద్దనుండి) రంగును వేసికొని రావలెను. కంటిమీదిరంగు విస్తారము ఊదాగ నున్నయెడల ఆకుపచ్చరంగుతో దిద్దుకొనుము. దిద్దుటలో విస్తారము ఆకుపచ్చగ నైపోయినయెడల చర్మపురంగును దానిపై వేయుము. కంటిపాపయందు వేయబడిన నీలియొక్క గాడత్వమును సిపియాతోను, కోబాల్టుతోను తగ్గించవచ్చును. తెల్లనిభాగములయందు విస్తారము నీలి యున్నయెడల, తెల్లనిరంగును వేసినయెడల మంచిది. కంటియందు ఆకుపచ్చరంగును వేసియుండిన చర్మపురంగుతో సవరింపవచ్చును. పిమ్మట కనుబొమ్మలను సిపియాతో దిద్ది నలుపు నచ్చటచ్చటవేసి వాటికి సౌందర్యమును కూర్చగలము. కంటినలువైపులు వేండిక్కురంగును వేసి దిద్దుకొన నగును.