పుట:2030020025431 - chitra leikhanamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవపర్యాయము రంగును వేయునపుడు చాయను వెలుతురును చెట్టుచెట్టుకు భేదమును తెలియజేయవలెను. తడిగ నున్నపుడే రెండవమారు రంగువేసిన చెదరిపోవును. ఇది కొన్నిసమయములయందు లాభముగను, కొన్నితరుణములయందు నష్టముగను పరిణమించును. చెదరకుండ నుండవలె నన్న మొదట వేసినరంగు ఆరినవఱకును వేచియుండవలెను. మూడవపర్యాయము రంగును వేయునపుడు చెట్టుయొక్క జాతిని తెలియజేయునటుల చిత్రింపవలెను. దీనితో రంగును వేయుట పూర్తిచేయవచ్చును. ఈమూడుముక్కలతో మనపని సరిపోలేదు. మనము విసుకుదల లేకుండ చాలదినము లభ్యసింపవలెను. పెన్సిలుతో వ్రాయునపుడు ఛాయను, వెలుతురును, చెట్లజాతిభేదమును తెలియజేయవచ్చును. రంగులను పూసి వెలుతురును, జాతిభేదములను, రంగులను తెలియజేయవచ్చును. రంగులను పూసినచిత్రము ప్రకృతిచిత్రము ననుసరించి యుండును. అందువలన పటములను రంగులతో చిత్రించుటయే మంచిది.

కొన్నిసమయములయం దొకేరంగుతో చిత్రింపవలసియుండును. అప్పుడు వివిధతరగతులచాయను జాగరూకతతో చిత్రింపవలెను. ఇటుల చేయక ఛాయను వ్రాయవలసినచోటను దట్టముగను, వెలుతురును ప్రదర్శింపవలసిన చోటున పలుచగను చిత్రించి చిత్రమును పూర్తిచేసితి నని యుప్పొంగరాదు.

చెట్టెప్పుడును ఆకుపచ్చగ కనబడదని వేళనుబట్టియు, ఋతువు ననుసరించియు, ఆకాశపురంగునుబట్టియు, చెట్టురంగు మాఱుచుండు ననియు నిదివఱకే చెప్పియుంటిని. అన్నిచెట్టు లొకేరంగుగ నుండవు. జామచెట్టు రంగుకంటె మామిడిచెట్టురంగు దట్టముగ నుండును. మామిడిచెట్టురంగుకంటె పనసచెట్టురంగు గాడముగ నుండును. ఇట్టి భేదము లన్నియు మనచిత్రమునందు చూపుచు వివిధజాతులచెట్లను చక్కగ ప్రదర్శింప ప్రయత్నించవలెను.

వివిధతరగతుల చెట్లు.

వటవృక్షము :- ఇది హిందూదేశవృక్షములకు రాజు. దీనిని ప్రతిదినము మనము చూచుచుండుము. ఈవృక్షము బాగుగ పెరిగిన పెద్దమేడవలె నుండును. ఇది మనకు మిక్కిలి యుపయోగకారి. దీనియాకులయందు భుజించెదరు. దీనియూడలను దంతధావనము చేయునపు డుపయోగించెదరు. దీనిపాలు జిగురుగ నుపయోగపడును. దీని నీడయం దనేకులు బాటసారులు శ్రమ దీర్చుకొందురు. దీనిఫలములములు పక్షుల కాహారము. ఇట్టివృక్షమును చిత్రించుట మనము నేర్చుకొనుట విధాయకము.

ఈచెట్టునం దాకులు దట్టముగ నుండవు. కొమ్మలెల్లచోట్లను కనబడుచుండును.

మొండెము:- దీనిమొండెము మిగుల వలముగాను, కరకుగా నుండును. ఎచ్చటచూచినను తొఱ్ఱలు గుంపులు కానవచ్చుచుండును. అనేకమొండెములు కలసియున్నటులుండును. దీనిపై నొకవిధమైన తెల్లనినాచు పెరుగును. ఇది కొమ్మలయందుకూడ పెరుగును. అంతట నిది వ్యాపించనప్పటికిని అచ్చటచ్చట వృక్షమంతట వ్యాపించి చిఱుతపులి బజ్జెలువలె కాన్పించుచుండును.

కొమ్మలు:- ఇవియు వలముగాను, కరుకుగాను ఉండును. మొండె మంతయభ్యాసకరముగ నివి కానరానప్పటికిని గుంపులతో నిండియుండును. ఇది వంకరగ పెరుగును. సాధారణముగ నీకొమ్మలు భూమికి సమాంతరములుగ నుండును.

ఆకులు:- ఈయాకులు యించుమించు గుండ్రముగనుండును. వీటికాడలు పొట్టిగను, పసుపువర్ణముగను కానవచ్చును. ఇవి కొమ్మలయందు గుంపులుగుంపులుగ పండ్లతో కలసి పెరుగుచుండును. చిగుళ్లు సూదిగ నుండును. ఆకులు నీలమిశ్రితమైన గాడమైన ఆకుపచ్చనిరంగును కలిగియున్నవి. ఆకులు వార్ధక్యమునందు పసుపుపచ్చగనైపోవును. 31 - 2 చూడుము.

పండ్లు:- ఈచెట్టుయొక్క పుష్పములు కానరావు. పండ్లు కొమ్మలకొనలయందు గుంపులుగుంపులుగ పెరుగును.