పుట:2030020025431 - chitra leikhanamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ భాగము.

మనుజుని రూపము.

మనుష్యులను వ్రాయుటయందు మన మనేకసంగతులను గమనింపవలెను. మనము వ్రాసిన చిత్రమునందు భాగములన్నియు ననుపాతముగా నున్నవో లేవో చూచుకొనవలయును. 20 - 1 చూడుము.

చిన్న కాళ్లును, పెద్దనడుమును, ఇంక పెద్దతలను, కలిపి వ్రాసినయెడల హాస్యాస్పదముగ నుండును. బుఱ్ఱకు తగినచేయి, చేతికి తగిన దేహము, దేహమునకు తగిన కాళ్లు ఉండునటుల చిత్రమును వ్రాయవలయును.

కొన్నికొన్ని సమయములయందు కాళ్లు పెద్దవిగ వ్రాయవలసివచ్చును. మఱికొన్ని సమయములయందు బుఱ్ఱ పెద్దదిగ వ్రాయవలసివచ్చును. ఇట్టిసమయములయందటుల చేయక తీరదు. ఏలయన, నేదో యొకపుస్తకము ననుసరించి చిత్రమును వ్రాయవలసివచ్చినప్పు డందు చెప్పినట్లు వ్రాయుటకు బద్ధులైయుందుము. నవ్వుపుట్టించు చిత్రము నేదైన వ్రాయవలసివచ్చినప్పుడుకూడ మన మన్నియు సమముగ వ్రాయుటకు వీలుండదు. కాన మనము సమయమునుపట్టి చిత్రమును వ్రాయవలసియుండును. 20 - 2 చూడుము.

ఆఫ్రికాదేశమునందు నివసించు నీగ్రోజాతివారికి పెదవులు పెద్దవిగ నుండును. జపానుజాతీయులకు కండ్లు చిన్నవిగను ముఖములు బల్లపరపుగ నుండును. పోలండు దేశీయులు కురుచుగ నుందురు. వీరిచిత్రములను వ్రాయుట యందు వీరివీరిరూపముల ననుసరించి వ్రాయచుండవలెను.

ఒకమనిషి నిలువబడియుండినవానిని వివిధస్థలములనుండి చూచిన ననేకవిధముల కనబడును.