పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 40

సులభ వచన గ్రంథములు

ప్రభుత్వమువారు స్థాపించిన కళాశాలలో రాజకీయోద్యోగులై యాంగ్లభాష మాతృభాషగాఁగల దొరలకే తెలుఁగు నేర్చుకొనుట యావశ్యక మగుటచే వారికొఱకు సులభమగు శైలిలో వచనగ్రంథములు వ్రాయవలసివచ్చినది. ఇవి వారు గ్రహింపఁదగిన సౌలభ్యముతో నున్నను కేవల వ్యవహార రచనలుకాక గ్రాంథికరచనతో నొప్పెడివి. ఆ కళాశాలలోని రావిపాటి గురుమూర్తిశాస్త్రులుగారు విక్రమార్కుని కథలను (1819), పంచతంత్రకథలను (1834) రచించిరి. ఇవి 1860 లోపుగ నొక్కొక్కటి నాల్గుముద్రణము లందిన వన్నచో వాని కెంత వ్యాప్తి యుండెడిదో తెలిసికొనవచ్చును. ఆ కాలములోనే శుకసప్తతి కథలు, హరిశ్చంద్ర చరిత్ర, విజయ విలాసము, తాతాచార్యుల కథలు మున్నగునవి రచితములైనవి. భాషాపోషకులగు బ్రౌనుదొరవారు సులభ వ్యావహారిక రచనలో కొన్నిగ్రంథములను ప్రకటించిరి. కాని యవియన్నియు భాషయందు ప్రాథమిక శిక్షణపొందుటకు మాత్రమే తగియుండి కేవలము రాజకీయోద్యోగులకే యుపయోగపడెడివి కాని యుత్తమసాహితీద్వారమున భాషాపాండిత్యమును సంపాదింపఁ గోరు విద్యార్థుల కేమాత్రమును సహాయకారులుగా నుండెడివి కావు.

గ్రాంథిక వచన రచన

మదరాసు విశ్వవిద్యాలయ మేర్పడిన వెనుక కళాశాలలో నుత్తమతరగతులకు ప్రౌఢవచనసాహిత్యము కావలసివచ్చినది.