పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 39

నందువలె నిచ్చట తెనుఁగున గ్రాంథికరచన, వ్యావహారికరచన యని రెండువిధములుగా ప్రవర్తిల్లుటకు వీలులేదు. ఏలయన, ప్రజాసామాన్య వ్యవహారభాష తెనుఁగు కాకపోవుటచే గ్రంథరచనలలో సలక్షణ మగు వచనమునే యుపయోగించవలసిన యావశ్యకత యేర్పడినది. ఈ కారణముచేతనే సలక్షణవచన వాఙ్మయము దక్షిణాంధ్రదేశముననే తొలుత ప్రారంభమైనది. ధేనుమాహాత్మ్యము, శ్రీరంగమాహాత్మ్యము, సారంగధర చరిత్ర, జైమినీభారతము, భారతరామాయణములు, హాలాస్య మాహాత్మ్యము మొదలగు ప్రశస్తవచనగ్రంథములు దక్షిణదేశమున పుట్టినవియే.

కుంఫిణీ కాలము

క్రీ. శ. 1700 ప్రాంతమునుండి ఈస్టిండియాకంపెనీ వారితో మనకు సంబంధము కలిగి క్రీ. శ. 1800 నాఁటికి వారిరాజ్యము స్థిరముగా నెలకొన్నవెనుక వచనవాఙ్మయ దృక్పథము మాఱినది. బ్రిటిషు పరిపాలన ప్రారంభములో క్రైస్తవమతాచార్యులు వారి మతప్రచారముకొఱకు క్రైస్తవ మతగ్రంథములను సులభగ్రాహ్య మగు వ్యావహారికశైలిలో వచనరూపమున వ్రాయ మొదలిడిరి. అంతేకాక వ్రాసిన గ్రంథములను ముద్రించు పద్ధతినిఁగూడ వారే దేశమున ప్రవేశ పెట్టి వ్యాప్తినొందించిరి. కాని యిందలి శైలి యేగ్రాంథిక వ్యావహారికపద్ధతిని నతుకుకొనకపోవుటచే నది బైబిలు తెలుఁగుగా పరిణమించి దానిప్రవర్తకు లనుకొన్నంత ప్రచారములోనికి రాలేదు.