పుట:2015.393685.Umar-Kayyam.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

49

192

ఒక ముహూర్తంబులోఁ బాపి యొందు సుకృత
మొక ముహూర్తంబులో మూర్ఖుఁ డొందుఁ దెలివి
నట్టి యీ ముహూర్తమె సుఖ మందుఁగడపు
మొక ముహూర్తంబె గద మన కుర్వి బ్రతుకు.

193

కాలము నిన్నుఁ గష్టముల కై వసమున్ బొనరించి యెఁదొ యే
వేళనొ ప్రీతియౌ నుసురు పీల్చును నచ్చెరువంద నీవు నా
నాలుగునాళ్ళు శాద్వలమునన్ విహరించి సుఖింపుమోయి నీ
కాలముదీఱి గోరిపోయి గడ్డి జనింపకమున్నె మానివై.

194

తొలకరులన్, వసంతములఁ దొయ్యలులన్ జతగూడియున్ గులా
బులు గొనునట్లు పాత్రలను బోసినమద్యము వేడ్కతోఁ గరం
బులఁ గొని త్రావు మీక్షణము పోయిన మృత్యువునిన్ను మట్టిలోఁ
గలుపఁగ వేచియున్న దనుకంపఁ దలంప దొకించు కేనియున్.

195

శారద చంద్ర చంద్రిక, ప్రశాంతనిశాసమయంబు ప్రేమ యే
పారెడు నేఁడు కాంత ! మధుపాన మొసంగుము ! జాగు సేయ కా
ఘోరవిదగ్ధ మృత్యు వదిగో ! జ్వల దగ్నికణంబురీతి నే
దారినొ వచ్చి మీదఁబడి దగ్ధ మొనర్చు ; నెఱుంగుమీ మదిన్.