పుట:2015.393685.Umar-Kayyam.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ఉమర్ ఖయ్యామ్

187

బ్రతుకు రెన్నాళ్లు మధువును ద్రావుమింక
జరిగిపోయిన కాలంబు తిరిగి రాదు
నీ చెడుగుఁగోరు నీధాత్రి నీవుగూడ
రేయుఁబగలును ద్రాగు మైరేయ మరసి.

188

చెల్లనిడబ్బు మాకడను జెల్లదు మానిలయంబు పాచి రా
గోల్లసమన్నఁ జీపురుగ నూడ్చుచునుండు నుషస్సులందు మై
ఝల్లన నొక్క వృద్ధు మధుశాల కవాటము విప్పిచెప్పె నీ
కల్లును ద్రావుమీవు చిర కాలము లేవవటంచు నిద్దురన్.

189

కడుపు నిండఁగ నీవు కాదంబరిని ద్రావు
             మావల నిది యలభ్యంబుచూవె
సహచరులను రోసి సతులతో జతఁ బాసి
             వసుధను నిద్రింప వలసివచ్చుఁ
గావున జాగ్రత్త ! కడురహస్యం బిది
             యెవ్వారికిని వినిపింపరాదు
ఏమన్న నిది విన్న నిల నన సైతము
             వికసించుటకు నెద వెఱచుచుండు.

190

లెమ్ము తొలకరివాన పూరెమ్మ లెల్ల
క్షాళనముఁ జేసెఁ గైకొమ్ము చషక మింక
నేఁడు నానంద మిడు నస్య నిచియమెల్ల
ఱేపు నీగోరిపై మొల్వ నోపుగాదె.