పుట:2015.393685.Umar-Kayyam.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. భారతదేశ శాసనసభా సభికత్వపదంబుఁ జేర నేఁ
     గోరఁగ జ్ఞాన సభ్యులు నకుంఠితదీక్ష జగంబు మెచ్చఁగా
     భూరితప స్సమాధి తమ బుద్ధిని నిల్పి జయంబుఁ దెచ్చినా
     రారయ జ్ఞానశక్తికి నజాండము కంపిలుచుండుఁ జూచితే.

చ. కవిత నెఱుంగనట్టి పృధుకాలము వ్రాసితి పుస్తకంబు లా
    కవిత నెఱింగి వ్రాయుటకు గంటమురాదు. నుపన్యసించు నా
    దినముల విద్యతోఁ గలసి తృప్తిఘటించెడు వాని నిప్పుడో
    లవము నుపన్యసించుటకు లజ్జఘటించెడు నేమిచెప్పుదున్.

శా. ఢిల్లీ భారతశాసనైకసభ రూఢిన్ ప్రాతినిధ్యంబు సం
     ధిల్లన్‌జేరిమహత్తరోజ్జ్వలకళాధిక్యంబురంజిల్ల వి
     ద్వల్లోకంబున రాజకీయకలనావ్యాపార పారంగతం
     బెల్లన్ వేట్కను నిర్వహించుచును నేనీగ్రంథమున్*వ్రాసితిన్.

ఉ. ఏమహిమాలయంబుపయి కెక్కి తపస్వులఁ జూచి వారి వి
    న్నాణములన్ గ్రహించి విజనంబగుచోట రచించినాఁడ నా
    నా నవ కావ్యమార్గము లనంతముగా హృదయాంతరంగ వి
    జ్ఞానము విశ్వరూపముగఁ గన్పడునట్లు దృశంబు మార్చు చున్.

శా. నాలోనున్నవి నేనుజూచినవి విన్నాణంబులై లోకమం
     దాలోకింపఁగ రాని యీ యమరవిద్యాతత్త్వమర్మంబు లం
     దేలోటున్ జనియింప దీశ్వర రహస్యేకైక మీమార్గమే
     మేలా దాచెదమంచుఁ జెప్పితిమి మీరిద్ధాత్ములై తేరఁగన్.

కం. మా తాతయు మా తండ్రియు
     ఖ్యాతిని ఆ ఖై లలీ మహాగురువర వి
     ద్యాతత్త్వము నేర్చిరి త
     ద్రీతుల వివరింతు యోగరీతులు తెలియన్.