పుట:2015.393685.Umar-Kayyam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     చూపొఖత చెమామెరసద్ అజమద్బఖయిష్క
     అజకస్ తమాఖా సదారేం ఖుషేం."

అనఁగా.

మ. జగతిన్ దుఃఖమొకింత నామనసులోఁ జర్చింపఁగా లేదు రే
     వగలం దెప్పుడో గుప్పెఁడన్నము లభింపన్ జాలు లేకున్నచో
     వగపేలేదు మహానసగృహములోఁ బక్వాన్నమే చిక్కుచుం
     డఁగ నన్యుంగని వేఁడ నేఁటి కది మూఢత్వంబు గాకుండునే ?

అని బదులుచెప్ప నాతనివివేకమునకు, స్థితప్రజ్ఞకు నెంతయు సంతసించి సంవత్సరమునకు (1200) పదిరెండువందల తోమానులు - తోమాసనఁగా ఇరువది రూపాయలు ; ఇరువది నాలుగువేల రూకలు (రు. 24'000) నైషాపురమునం దాదాయమువచ్చు భూమి దానపట్టా వ్రాసి యిచ్చిపంపెను. ఇది గని యొక జిజ్ఞాసువు నేనడిగి దేవురించి నను నెవరును నా కొన కాసైన నియ్యరే నీ కింతధనమెట్లు వచ్చినది ? అని యడిగినాఁడు. వానితో,

మ. ధనవాంఛన్ ద్యజియించి యేఁగు ప్రతిపాదంబందు వేవేలుగా
     ధనరాసుల్ లభియించు లేనియెడ నర్థం బర్థి రాఁబోవ దే
     పనియైనన్ సమకూడలేదని మదిన్ భావింప కీ దుఃఖ ముం
     డిన దీర్ఘంబు ననర్థదాయకమునై డిందించు నీజీవమున్.

శా. రాగద్వేషము లాశ్రయించి విషయభ్రాంతిన్ బ్రవర్తింప ను
    ద్యోగింపన్ దగునా జగాన విధి సంయోగంబుచే నెందఱో
    భోగా పేక్షను వచ్చిపోయి రిటులే ముందిఁక రానున్న వా
    రేగన్ జూతురుగాని యొక్కఁడిలపై నిష్టార్థముల్ పొందెనే.