పుట:2015.393685.Umar-Kayyam.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

61

240

కాలము నిన్ను, నన్ను వెసఁగైకొని ప్రాణము లూడ్చి వేయ వే
లీలల వేచియున్నది చెలీ ! సురశాద్వల వీధులందు రా
వేలను ? ద్రావఁబోవుద మదే మనదేహపు మెట్టిపైని తీ
పూలును, దీవలున్ మొలక పూర్వమె వేడుక చూత మంగనా !

241

ఓచెలి ! నిర్విచార వయియుండుము ; కాల మదేమి చేసినన్
జూచియు ఖేద మొందకుము చూడు ! త్వదీయ శరీరవస్త్రముల్
పీచయిపోవ నున్న వలివేణిరొ ! కర్మ. మకర్మ, ముచ్చమున్
నీచము నున్నదే ? జగ మనిత్యము దీనివిచార మేటికిన్ !

242

అఱువ దేఁడులకన్న నీ వధిక ముందు
ననకు ; మెట కేఁగినను, గామి వగుచుఁ బొమ్ము ;
త్వత్కపాల భాండము లమ్మఁబడక మున్నె
పొమ్ము కలశాలి విడక వే యమ్ముకొమ్ము.

243

కోవిదకోటి వీడి, యొకకోమలి ముంగురులన్ వరించి, వి
ద్యావిద ! మద్యపానమును హాయిగఁ జేయుము ; కాల మింక నీ
జీవధనంబు గైకొని విశీర్ణత నీరుధిరంబు చేరలన్
ద్రావగనున్న దీమధువు ద్రావుము నీవది చూడకుండఁగన్.