పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము రచించినది కొమఱ్ఱాజు వేంకటశివుఁడని గ్రంథాంతమునఁగలపద్యమువలనఁ దెలియుచున్నది. ఈ వేంకటశివునివ్యవహారనామము వెంకటప్పయ్య యనియు కృష్ణామండలములోని పెనుకంచిప్రోలువాస్తవ్యుఁ డనియు ఆంధ్రవాఙ్మయమునకు జీవకళల బ్రసాదించిన - కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు, ఎం.ఏ, గారి కీకవి జనకుఁడనియుఁ దెలియుచున్నది.

వేంకటశివుఁ డాఱువేలనియోగి బ్రాహ్మణుఁడు. లింగధారిమతములోనివాఁడు. ఉద్భటారాధ్యవంశపరంపరలోని యారాధ్యు లీకవిగురుకుటుంబములోనివారు. ఈకవి మునగాలసంస్థానప్రభుత్వము గావించి యిప్పటి మునగాల ప్రభువులగు శ్రీనాయని వేంకటరంగారావు బహద్దరువారిని దత్తులుగా దీసికొనిన లచ్చమారావుగారివద్ద మంత్రిగా నుండి చిరకాలము రాజకీయవ్యవహారములలోఁ బాలుగొనెను. ఈకవి మఱి కొన్ని శతకములు జ్యోతిషగ్రంథములు రచించినటుల శతకకవులచరిత్రము పేర్కొనుచున్నది గాని యాపుస్తకములనామములే తెలియవచ్చుట లేదు. అందులకుఁ బ్రయత్నించి కృషి చేయవలసియున్నది.

ఈశతకమునఁ బేర్కొనఁబడిన రాజలింగస్వామి రేపాలలోని యర్చాదైవతము. రేపొల మునగాల