పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376

భక్తిరసశతకసంపుటము


మ.

అతిచోద్యంబుగ నప్పురాసురులభార్యల్ వేడ్కఁ గావించుస
ద్వ్రతముల్ మోసముగాఁగఁ జేసియు సముద్యత్కీర్తిచే నిర్జర
ప్రతతు ల్సన్నుతి సేయఁగా నెగడు నీబౌద్ధావతారంబు సం
తతమున్ బ్రోచునుగాక నాదురితచింత ల్బాపి సీతాపతీ.

105


మ.

దురితస్వాంతు లసత్యవాదు లగుమర్త్యుల్ ధాత్రి జన్మించి సం
కరవర్గం బయిపోవ నాఖలుల గిన్కన్ ద్రుంచి ధర్మంబు సు
స్థిరతతన్ నిల్పవె కల్కిమూర్తివయి రాజీవాసనస్తుత్య భా
స్కరవంశాంబుధిపూర్ణశీతకర భక్తత్రాణ సీతాపతీ.

106


శా.

స్వర్ణక్ష్మాధరధీర నీగుణకథాజాలంబు సద్భక్తిచే
వర్ణింపన్ మదిగోర యీశతక మే వాక్రుచ్చితిన్ దీనిసం
పూర్ణానుగ్రహదృష్టిఁ గైకొని ధరన్ బోషించి సాయుజ్యసౌ
ఖ్యార్ణోరాశిని దేల్చు మీఁద రఘువర్యా రామ సీతాపతీ.

107


మ.

పుడమిన్ సాహెబు రాణవంశకలశాంభోరాశిసంపూర్ణచం
ద్రుఁడు వీరన్నకు రాజమాంబకు సుపుత్రుండైన రామన్న సొం
పడరంగా శతకం బొనర్చియున్ సముద్యద్భక్తి నర్పించెఁ బ్రే
ముడిచే గైకొని ప్రోవు డెప్పుడును లేము ల్బాపి సీతాపతీ.

108

సీతాపతిశతకము సంపూర్ణము.