పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము రచించినకవి రేమెల రామదాసుఁడు. ఇతఁ డార్వేలనియోగిబ్రాహ్మణుఁడు. అప్పయసూరి వేంకమాంబల కుమారుఁడు. ప్రతివాదిభయంకరము సింగరాచార్యులవారి శిష్యుఁడు. రావు గంగాధరరామారావుగారి పరిపాలనమునందున్న దుగ్గుదుర్తి గ్రామనివాసి. ఈయంశములు శతకాదియందలి పద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. గంగాధరరామారాయప్రభువర్యులు క్రీ. శ. 1870 ప్రాంతములం దుండియుంటచే నీకవియు నప్పటివాఁడనియుఁ బిఠాపురసమీపనివాసియనియు శతకకవులచరిత్రకారులు వ్రాసియున్నారు. పీఠికాపురసంస్థానప్రభువు లగు నే గంగాధరరామారావుగారికాలమున నీకవి యుండెనో శతకమున విస్పష్టముగఁ దెలుపఁబడకపోవుటచేఁ గవిజీవితకాల మెంతవఱకు నిశ్చితమొ నిర్ధారణము చేయ నయితి కాదు.

ఈశతకమునందు భక్తమందారమనఁదగు శ్రీరామమూర్తి యభివర్ణితుఁడయ్యెను. ఇందలిపద్యములు ధారాళశైలితో సులభగ్రాహ్యములై పఠనీయములై యున్నవి. స్వతంత్రభావములు మనోహరముగా నుంటచే నీశతకమును భక్తిరసశతకసంపుటమునందుఁ జేర్పఁబూనితిమి.