పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

రమాధీశ్వరశతకము

శా.

శ్రీదేవీకుచకుంభసమ్మిళితకాశ్మీరంబు వక్షోమణిన్
దాఁ దాస్యంబు ఘటింప వామకరపద్మస్పర్శనాలింగన
స్వేదాంభోరుహదివ్యమూర్తియగు లక్ష్మీవిష్ణుదేవున్ మిమున్
వేదాంతుల్ మది గాంచి మ్రొక్కుదురు గోవిందా రమాధీశ్వరా.

1


శా.

క్షోణిన్ మర్త్యుఁడు మోక్షసాధ్యపదవిన్ గోవిందనామాంకని
శ్రేణిన్ గాంచుటఁ జూచి మీనుతులు నేఁ జేయంగ మైకొంటి నా
వాణీదేవియు మీప్రసాదగరిమన్ వాక్యంబు లందిచ్చుచో
వీణాపుస్తకపాణియై నిలుచు గోవిందా రమాధీశ్వరా.

2


శా.

నాగేంద్రాఖ్యుఁడ నౌదుఁగాని ముఖముల్ నా కేమి వేయున్నవో
భోగానందసువర్ణధర్మగుణసంపూర్ణప్రభావుండనో
ధీగంభీరపదశ్రుతిస్ఫురణ గీర్తింతున్ వచోరూఢి నీ
వే గీర్వాణమునీంద్రవంద్యపద గోవిందా రమాధీశ్వరా.

3