పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

గానరావు. శైలిని బట్టిచూడ శతకము ప్రాచీన మనుటలో సంశయము లేదు. శతకమునందలి "నాగేంద్రాఖ్యుఁడ” ననుపద్యమువలనఁ గవి నాగసమాఖ్యుఁడని తెలియును. పదమూఁడవశతాబ్దిలో రేచెర్లగోత్రీయుల యాస్థానమునందున్న నాగనాథుఁడే శతకకర్తయై యుండునేమో తెలియదు.

త్రయ్యంతార్థము, జియ్యాళ్వారు, శ్రీసూక్తి, ప్రపన్నులు లోనగు పదములవలన నీకవి విశిష్టాద్వైతియని తోఁచును. ఈశతకమునందలి పద్యములు శ్రావ్యముగ మనోజ్ఞముగ నున్నవి. శతకములందు సహజముగాఁ గాననగు వ్యాకరణదోషములుగూడఁ గలవు. గాని గుణగణమునం దవి గణనీయములుగావు. ఈయుత్తమశతక మింక నుపేక్షించిన సంతరించునేమోయని యథోపలభ్యముగ సంస్కరించి యిప్పటి కీసంపుటమునఁ బ్రచురింపఁగలిగితిమి. ఈకవి నిజామురాష్ట్రమునందలి ఓరుగల్లుప్రాంతనివాసియై యుండును.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

1.1.25

శేషాద్రి రమణకవులు, శతావధానులు.

. .