పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

శశాంక విజయము


వాతెఱపా లిచ్చి వగలఁ దేలించి నా
        వలపు లీడేర్చినవన్నెలాఁడి
పావురావగఁ బల్కి పైకొనికుల్కి నా
        ముచ్చట ల్సమకూర్పు ముద్దుగుమ్మ


గీ.

మక్కువ నెసంగి కొఱికినమడు పొసంగి
గారవించినకొమ్మ బంగారుబొమ్మ
ననవిలుతువిద్యలకు నొజ్జ నాదుపజ్జ
కెన్నటికిఁ జేరు నావంత లెపుడు దీఱు.

59


చ.

తలిరులు కూర్మము ల్దొనలు దర్పకునద్ద మనంటికంబము
ల్పులినము నంబరంబు [1]సుడి పొందగుడుం దరఁగ ల్భుజంగము
ల్పలుపు నరు ల్లత ల్దరము పద్మము తుమ్మెదగుంపు గూర్చినక్
గలికి యనంగ నౌ నయినఁ గల్గునె తాదృశలీల సాటికిన్.

60


చ.

మకరపుడాలువానివిషమంపురణంబున లోలనేత్ర తా
రకలు మెఱుంగు లీన నవరత్నపుఁబాప బొట్టు మోమునన్
దకపికలాడ నాచెలువు ధన్యత నొందఁగఁ జిత్రభంగులన్
ముకుళితతానము ల్పలుకుముద్దులగుమ్మను జూచు టెన్నఁడో.

61


చ.

ఎసఁగిననెయ్యపుంగినుక నెంతయు మోడి ముసుంగు వెట్టి యా
కుసుమసుగంధి యున్నపుడు కొంకుచు నే జెయి దాఁచ నిద్రచేఁ
గసరినయట్లు మత్కరము గబ్బిచనుంగవపైకి దార్చి మై
నుసులుచు నీవి జార్చిన మనోహరలీలల నెన్న శక్యమే.

62


చ.

మలయజగంధి దా శిరసు మజ్జనమై తెలివల్వ యొంటికొం
గెలమి ధరించి ఱైక ధరియింపకయే కురులార్చుచున్న నే
నలమిని గౌఁగిలించుకొన నాహరిమధ్య యనంగసంగరా
కలనఁ బెనంగినట్టిరతికౌశలము న్మదిలోఁ దలంచెదన్.

63


చ.

పులుగులకబ్బలో కనకపుంజిగిదిబ్బలొ దానిగుబ్బలో
వలపులదీవియో సుధలబావియొ దానిమెఱుంగుమోవియో
కలువలబంతియో కుసుమకార్ముకదంతియొ కాక యింతియో
యలవియె దానియందము శివా! తలఁప న్దెలుప న్నుతింపఁగన్.

64
  1. సురపొన్నగడన్