పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శశాంకవిజయము

చతుర్థాశ్వాసము

శ్రీమధురాధిపసన్నుత
సామాదికచతురుపాయసంధానభవ
శ్రీమానితకవివినుత
క్షేమంకర సుగుణహార సీనయధీరా.

1


వ.

అవధరింపుము సూతుండు శౌనకాది మహామునీంద్రుల కిట్లనియె.

2


ఉ.

అంత గురుం డనంతమహిమాతిశయంబున నప్పులోమజా
కాంతుఁ డొనర్చుయాగము నఖండితవైఖరి నిర్వహించి తా
నెంతయు భక్తియుక్తి నతఁ డిచ్చు బహూకృతు లంది హర్షిత
స్వాంతత నాశ్రమంబునకు వచ్చె వియచ్చరకోటి గొల్వఁగన్.

3


క.

తారయు వాచస్పతికిని
దా రయమున నెదురు వచ్చి తాత్పర్యంబున్
గూరిమియు భయము భక్తియు
గౌరవమున్ హర్షమున్ బ్రకాశింపంగన్.

4


క.

పాదములు గడిగి పయ్యెద
చేఁ దడి యొత్తి పదజలము శిరమునఁ గొని
వేదండయాన యతనికిఁ
గైదండ యొసంగె వినయగౌరవ మెసఁగన్.

5


ఉ.

ఇంటికిఁ దోడి తెచ్చి మణి హేమమయోజ్జ్వలపీఠి నుంచి ప
య్యంట చలింపఁగా సురటి నల్లన వీచుచుఁ బ్రాణనాథ! న
న్నొంటిగ నుంచి యీకరణి నుండుదురే? క్రతు వాయెనే? సుఖం
బుంటిరె యిన్నినాళ్ళు? పురుహూతబహూకృతిఁ గంటిరే? యనన్.

6


మ.

క్రతు వాయె న్సుఖ ముంటి వాసవునిసత్కారంబుఁ గైకొంటి ది
క్పతు లత్యుత్తమరత్నభూషణధనవ్రాతంబు లర్పించి రు