పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేణుగోపాలశతకము

సీ.

కౌస్తుభవక్ష శ్రీకరపాదరాజీవ
            దీనశరణ్య మహానుభావ
కరిరాజవరద భాస్కరకోటిసంకాశ
            పవనభుగ్వరశాయి పరమపురుష
వేదవేద్యానంతవిభవ చతుర్దశ-
            భువనశోభనకీర్తి పుణ్యమూర్తి
వైకుంఠపట్టణవాస యోగానంద
            విహగరాడ్వాహన విశ్వరూప
నీలనిభగాత్ర శ్రీరమణీకళత్ర
సద్గుణస్తోమ యదుకులసార్వభౌమ
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

1


సీ.

నిను సదా హృత్కంజమునఁ బాయకుండ నా
            ప్రహ్లాదువలెను నేర్పరిని గాను
ఏవేళ నిను ధ్యానించుచుండుటకు నా
            దృఢచిత్తుఁ డైనట్టి ధ్రువుఁడ గాను
సతతంబు నిన్ను సంస్తుతి చేయుచుండ నా
            వేశిరంబుల సర్పవిభుఁడ గాను
నీ విశ్వరూపంబు సేవించుటకు సహ-
            స్రాక్షముల్ గల్గు వాసవుఁడఁ గాను
ఇట్టివారలఁ గృపజూచు టెచ్చుగాదు
దేవ నా వంటి దీనుని బ్రోవవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

2