పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దశమి నొకపూట నేకా
దశి రేపగ లుపవసించు ద్వాదశి నొకపూ
టశనము గొను పుణ్యుడు లో
కశరణ్యుఁడు కుందవరపు కవి చౌడప్పా.

90


క.

పరగడుపున సభలోపల
తరుణులయెడ భుక్తమైన తరి నొక విడెముం
దొరకని వరునకు సౌఖ్యము
కరువప్పా కుందవరపు కవి చౌడప్పా.

91


క.

ఏపాటిదయిన ప్రక్కకు
దాపొక్కటి లేకపోతె తరమటరా యీ
పాపపుదినములు గడువగ
కాపాడుము కుందవరపు కవి చౌడప్పా.

92


క.

యతికి మఱి బ్రహ్మచారికి
అతులితముగ విధవముండ కశ్వంబులకున్
సతతము మైథునచింతయె
దతిఁ దోపదు కుందవరపు కవి చౌడప్పా.

93


క.

ముదిత చను మెత్తనయినను
యధికారము మెత్తనయిన నాటికి దొరకున్
మది మెత్తనయిన రోతురుఁ
గదరప్పా కుందవరపు కవి చౌడప్పా.

94


క.

అంభోజాక్షులలోపల
రంభే కడుచక్కనిది రాగంబులలో
గాంభీర్యమైన రాగము
కాంభోజే కుందవరపు కవి చౌడప్పా.

95