పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎవ్వఁ డిద్ధాత్రిఁ బదిపల్లె లేలుచుండు
నతఁడు సర్వజనోత్తముం డనఁగ బరఁగు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

63


కుక్షింభరుని బుధ రక్షా పరుం డంచు
               నతి నికృష్టుని మహాత్యాగి యనుచు
బహుబీజ సంభవుఁ బరమపావనుఁడంచుఁ
               జంచలాత్ముని ధైర్యశాలియంచు
దౌర్జన్యకారిని ధార్మికోత్తముడంచుఁ
               గఠిన చిత్తుని దయాకరుఁడటంచు
జారకర్ముని పరదార వర్జితుఁడంచు
               నుత్త మూఢుని శాస్త్రవేత్తయంచు
గవులు కక్కూర్తి చేతను గడుపుకొఱకు
సన్నుతింతురు మదిలో విచారపడక
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

64


పండిత శ్రేణికి బ్రబలమాత్సర్యంబు
               ఘన కవీంద్రులకు యాచక గుణంబు
భాగ్యవంతులకు వైభవ మదోద్రేకంబు
               సత్కులోద్భవులకు జారవృత్తి
ధరణీసురులకు సత్కర్మానపేక్షత
               విద్యాధికులకు దుర్వినయగరిమ
నరనాథులకు నీచపురుషసాంగత్యంబు
               తాపసోత్తములకుఁ దామసంబు
నలువ కల్పింపఁడేని తన్మహిమఁబొగడఁ
దరమె యెవ్వరికైన యిద్ధాత్రియందు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

65