పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనగోపాలశతకము

వారికే, భగవద్భక్తి కలవారికే సకలైశ్వర్యములు భోగభాగ్యములు లభించునని సూచించెను. మానవులు ఉన్నతకళను సాధించి సుఖజీవనము గడుపుటకు భక్తి అవసరమని స్పష్టమొనర్చుట ఇట్టిది.

భర్తృహరి ననుసరించి వేంకటకవి సజ్జన దుర్జన లక్షణములను నిర్దేశించిన సందర్భములు పెక్కు కలవు — మూర్ఖులను దుర్జనులను వారి దుశ్చర్యల నీ కవి నిశితముగ విమర్శించెను. కొన్ని సందర్భములలో అన్యాపదేశరీతిలో నీతిబోధన మొనర్చబడినది. మూర్ఖుల చిత్తవృత్తిని సంస్కరించుట అసాధ్యమని వచించి, నానావిధములైన వారి కపటప్రవృత్తులను విపులముగా చిత్రించుటలో ఈ కవి ప్రత్యేకమార్గము ననుసరించెను — అప్పునెగగొట్టువాడు, గురుజనద్రవ్యము నపహరించువాడు — తలిదండ్రుల కష్టపెట్టువాడు, తనయపత్నిని కామించువారు, పరదోషముల నెన్నువారు, సజ్జనులకు హాని తలపెట్టువారు, ప్రజలను పీడించువారు, మాన్యములను హరించువారు — దానగుణహీనులు — అతిహీనవృత్తిని పాటించు వారు, మొదలగువారిని ఈ కవి అధిక్షేపించెను. సంఘమున ప్రబలిన అనాచారము — అధర్మము మున్నగువానిని కూడ వేంకటకవి సందర్భానుసారముగ తీవ్రదృష్టితో విమర్శించెను. చౌర్యము — జారగుణములను విమర్శించిన సందర్భము లిట్టివి.

సాంఘికవ్యవస్థ అస్తవ్యస్త మగుటకు, అధర్మవృత్తి ప్రబలుటకు కలిప్రభావమే ప్రధానకారణమని కవి భావించెను. కొన్నింటిని బ్రహ్మసృష్టిలోని వైచిత్ర్యములుగను, మానవుల కర్మఫలజన్యముగను ఊహించెను. బ్రహ్మసృష్టిలోనే ఒక విధమైన వైపరీత్యము కలదని ఒక సందర్భమున చాటెను. సరససౌందర్యలక్షణకళావతికి ముష్కరరూపుని భర్తగా కూర్చుట, సంతతసాధునిశ్చలపుణ్యవర్తికి బలుగయ్యాళిని భార్యగా కూర్చుట ఇట్టిదని వేంకటకవి నిరూపించుటకు యత్నించెను. ఖలులకు కపటవర్తనము పుట్టుకతో వచ్చిన దనియు, అది అంతరించుట కష్టమని వారి స్వభావము నెన్ని, విసిగి, ఖలులను, మూఢులను బుట్టించిన వేధననవలె వారిని తిట్టి ఫల మేమి టని నిర్వేదము నొందెను. కలి