పుట:2015.373190.Athma-Charitramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 58

అక్టోబరు నెలలో నాకుఁ దటస్థించిన క్లిష్టశోధనము నా మతాభి ప్రాయములలోఁ గలిగిన కలవరమే. నాభక్తి కత్యంతావశ్యకము లని నే నదివఱకు నమ్మిన క్రైస్తవవైష్ణవసిద్ధాంత సాంప్రదాయములు అనగత్యములని నే నిపుడు విడనాడితిని. ప్రార్థనసమాజ మతసూత్రములే నా కింతటినుండి రుచికరము లయ్యెను. కావుననే నాదినచర్య పత్రములనుండి క్రైస్తవమతవాసనలు అప్పటినుండియు నదృశ్యమగుచున్నవి. ఈ నూతనసమాజాదర్శములు తగినంత దృఢముగ నుండెనో లేదో యిఁకఁ జూడవలసియున్నది.

విశాఘపట్టణవాస్తవ్యులగు మహామహోపాధ్యాయ పరవస్తు రంగాచార్యులుగారు రాజమంద్రి వచ్చి యుపన్యాసములు చేయ నున్నా రని మాపట్టణమునఁ గొంతకాలమునుండి వదంతులు గలవు. పాండిత్య వాగ్ధోరణులయందు ఆచార్యులవారు అసమానప్రతిభాన్వితులని జనూ నిశ్చితాభిప్రాయము. నవంబరు మూఁడవతేదీని విజయనగర మహారాజుగారి బాలికా పాఠశాలలో రంగాచార్యులవారు చేసిన యుపన్యాసము నేను వింటిని. హిందూదేశమునందు ప్రబలిన వివిధమతములనుగూర్చి వా రతిహృద్యముగఁ బ్రసంగించిరి. రంగాచార్యుల వారి యుపన్యాసము వినినవారలకు మతవిషయములనుగుఱించి మనస్సున గొప్పసంచలన ముద్భవించెను. మఱునాఁడే నామిత్రులగు రాజాకృష్ణారావుపంతులుగారితో కళాశాలలో మాటాడుచు, ప్రాచీన హిందూమతాదర్శము లున్నతమైన వయ్యును, గురువుల సంకుచిత భావములవలన మతమున కప్రతిష్ఠయు దేశమున కనర్థమును వాటిల్లుచున్న వని నేను నొక్కిచెప్పితిని. ఆయన నాకు పూర్తిగ సానుభూతిఁ జూపెను. హిందూమతసౌష్ఠవమును గాపాడవలె ననినచో, శంకరాచార్యులు మున్నగు పీఠాధికారుల నిరంకుశాధికారము నరికట్టి,