పుట:2015.373190.Athma-Charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. హిందూధర్మమా, బ్రాహ్మమతమా ? 57

16. హిందూధర్మమా, బ్రాహ్మమతమా ?

రామభజనసమాజము విడిచి పెట్టిన మొదటిదినములలో నాకు ప్రార్థనసమాజ మూలసిద్ధాంతములను గుఱించి యంతగఁ దెలియదు. హిందూసంఘదాస్య మొకింత తొలఁగించుకొని సంస్కరణాభిమానుల సహవాసభాగ్య మలవఱుచుకొనినచో, నేను పరిపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్ర్యముల ననుభవిం తు ననియు, నాకుఁబ్రియమగు క్రీస్తుసందేశములచొప్పున నప్పటినుండియు నడుచుకొనవచ్చు ననియు, నేను దలపోసితిని ! అంతియ కాని, ప్రార్థనసమాజాదర్శములకును క్రైస్తవమత విశ్వాసములకును, ఉత్తరదక్షిణ ధృవముల కుండెడియంతరము గల దని కలనైన నే ననుకొనలేదు ! అక్టోబరు 27 వ తేది సాయంకాలము, ప్రార్థనసమాజసభయందు వీరేశలింగముగారు "ఈశ్వరదత్తపుస్తకములను" గూర్చి యుపన్యాస మొసంగిరి. హిందూమతాభిప్రాయములనే యాయన నిరసించు నని నే నిదివఱ కెంచుచుంటిని. ఆయన నా కిష్టమగు బైబిలి, క్రైస్తవమతముల మీఁదఁగూడ నిపుడు దాడి వెడలుటకు మొదట మిగుల కంటగించితిని. కాని, అంతకంతకు నేను ప్రార్థన సమాజసిద్ధాంతముల కఱకుఁదనమున కభ్యాసపడితిని.

కొన్ని నెలలనుండి ప్రతి మాసారంభమునను, క్రీస్తు ప్రబోధించిన "ప్రభుప్రార్థన"ను నాదినచర్యపుస్తకమునఁ బూర్తిగా వ్రాయనభ్యాసపడితి నని యిదివఱకే చెప్పితిని. ఇపు డీనవంబరు మొదటి తేదీని లిఖింపఁబడిన ప్రార్థన మిటు లుండెను : - "భగవానుఁడా ! నీవు నానీతిప్రవర్తనమును గాపాడి, నాశీలపవిత్రతను సంరక్షించితివి. దేహమనశ్శక్తులందు వట్టిదుర్బలుఁడ నగునేను గతమాసమున నావర్తననైర్మల్యమును నీకృపాసాహాయ్యముననే నిలువఁబెట్టుకొనఁగల్గితిని."