పుట:2015.373190.Athma-Charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 36

వని నే నాశించితిని. జరుగుచదువున కంతరాయము గలుగుట తలిదండ్రులకు మొదట దుస్సహ మైనను, అచిరకాలముననే నే నారోగ్యవంతుఁడనై, వచ్చిననష్టమును వేగమె కూడఁదీయఁగలనని వారు నమ్మియుండిరి. 1888 వ సంవత్సరము ఫిబ్రవరి 18 వ తేదీని నేను కళాశాల మానుకొంటిని. ఆనెల 22 వ తేదీని మమ్ముఁ జూచి పోవచ్చిన మా రెండవ మేనమామతో, నన్ను వారి గ్రామ మంపి, అచట నాకు సదుపాయములు చేయింపు మని మాయమ్మ తనతమ్ముని మఱిమఱి వేడెను. అంతఁ గొంతకాలము నే నాగ్రామమున నివసించితిని. ఆదినములలో వేలివె న్ననిన మేము ఉవ్విళ్లూరుచుండెడి వారము. అది మాసోదరులలో మువ్వురికి జన్మస్థానము. మా ముత్తవ తల్లి, మేనమామలు మున్నగు బంధువర్గము నివసించు ప్రదేశము. పట్టణము విడిచి పల్లెయం దుండుట మొదట కొన్నిదినములవఱకు నాకుఁ గడు సంతోషముగ నుండినను, వేవేగమె గ్రామనివాసము నాకు మొగముమొత్తెను. ప్రాతస్సాయంకాలములందు నేను కాలువ గట్టుమీఁద విహారము సలుపుచుండువాఁడను. కాని, తక్కినకాలము గడచు టెట్లు ? పట్టణమందలి స్నేహసహవాసములు, వార్తాపత్రికలు, బహిరంగసభలు, ఇక్క డెట్లు సమకూరును ? అహర్నిశమును నాతో నుండు తమ్ములు చెల్లెండ్రు నిచట లేరుగదా ! పీల్చుటకు నిర్మలవాయువు, త్రావుటకు శుద్ధోదకము మున్నగునవి వలసినంత యిచట నుండుట వాస్తవమె. కాని, సుఖించునది మనస్సును విడిచిన శరీరముకాదు గదా ! కుగ్రామనివాసముమీఁద విసువుఁ జెందినపుడెల్ల నేను పట్టణము వచ్చి, తలిదండ్రులను సోదరీసోదరులను జూచి పోవుచుంటిని. తోడి విద్యార్థి యువకులు కళాశాలయందు విద్యాభివృద్ధి నొందుచుండఁగా, ఆరోగ్యాన్వేషణమునకనియును, హాయి