పుట:2015.373190.Athma-Charitramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. స్వైరవిహారము 37

ననుభవింతుననియును, నేను బడి యెగవైచి, పల్లెటూళ్ల యందు వ్యర్థ కాలక్షేపము చేయుచుంటి నని నే నంత గ్రహించి విచారించితిని. స్వయంకృతాపరాధమునకు పరిహార మేమి గలదు ? నాపూర్వ సహపాఠి యగు పాపయ్యశాస్త్రి సహవాసము మరగి, రాజమంద్రిలో నపుడపుడు నేను దినములు వెళ్లఁబుచ్చుచుండువాఁడను. స్వస్థలమగు కోనసీమకుఁ దాను బోయెద ననియు, వలసినచో నన్నుఁ గొనిపోయి యందలి దర్శనీయములగు తావులు చూపింతు ననియు నాతఁ డొకనాఁడు నాతో ననెను. ఇపుడు నేను గోరుచుండినదే యిట్టిమార్పు. మార్గమందు మా మేనత్తగారి నివాసస్థల మగు అమలాపురము ఉండుటచేత, అచటికిఁ బోయి నేను కొన్నిరోజులు నివసించుటకు మా తలిదండ్రులు సమ్మతించిరి. అంత 19 వ ఏప్రిలున సహచర సమేతముగ నేను బ్రయాణ మైతిని.

అప్పటి కప్పుడె అమలాపురపు కాలువ కట్టివేయుటచే, మేము ధవళేశ్వరము పోయి, అచటినుండి పడవపయనము చేసి, మఱునాఁడు దాక్షారామము చేరితిమి. శ్రీనాధుని "భీమఖండము" నేను జదువకున్నను, ఆంధ్రకావ్యములందు మక్కువగలిగి, నాతో "విజయవిలాస" "పారిజాతాపహరణము" లు గొనిపోయితిని. ప్రయాణమున నా కివియె నిత్యపారాయణగ్రంథము లయ్యెను. కాని, నాచెలికాఁడు రసజ్ఞత లేని రసికుఁడు. నూతనప్రదేశముల రామణీయకమును, ప్రాచీనదేవాలయముల పూర్వవాసనలును నా మనసు నమితముగ నాకర్షించెను. అచటనుండి కోటిపల్లి, ముక్తేశ్వరము మున్నగు క్షేత్రములు దర్శించి, 21 వ తేదీని మేము అమలాపురము చేరితిమి.

ఆపట్టణమున కనతిదూరమందలి యీదరపల్లి మా మేనత్తగారినివాసస్థలము. కొన్ని దినములవఱకును వారియిల్లు నావిడిది