పుట:2015.373190.Athma-Charitramu.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 624

శాంతి వికాసము లందెడి పవిత్రసమయ మిది. ప్రకృతిసౌందర్యములఁ గ్రోలి, ఆత్మ పరమాత్మానుసంధాన మభిలషించెడి పుణ్యకాల మిది. రచనాప్రణాళికయు కథాసంవిధానమును మనమున నే నేర్పఱుచుకొను సుసమయ మిది. అధిక మన:క్లేశమునఁ గాని, కార్యభారమునఁగాని డస్సిన స్థూలసూక్ష్మశరీరములకు సంధ్యాసమయమందలి నాదీర్ఘ విహారములు పునర్జీవన మొసంగుచుండెడివి.

ఇవ్విధమున నా జీవితము గడచిపోయెను. నాకన్నులకె మిగుల లోపభూయిష్ఠముగ నున్న యీ జీవితము, స్వచ్ఛమును నాదర్శప్రాయము నని నే నెట్లు మురియఁగలను ? ఐన నీకథ యెవరి కేమాత్రముగ నుపకరించినను, నేను ధన్యుఁడను. ముందును దయామయుఁడగు పరాత్పరుని ప్రాఁపె జీవితయాత్రయందు నాకుఁ జేయూఁత యగుఁ గాత!