పుట:2015.373190.Athma-Charitramu.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహావలోకనము 623

ధర్మనిర్వహణముగఁజేకొని మఱివిద్యాబోధనమొనరింపఁ బ్రయత్నించుచు వచ్చితిని. జ్ఞానస్వీకారమున నుత్తేజిత చేతస్కులగు శిష్యుల ముఖావలోకనము నిరతము నాకుఁ గనులపండువుగ నుండెడిది. కాని, యిది రానురాను క్రమశిక్షణధర్మనిర్వహణములకు భంగకరమగు సుఖలోలత్వవ్యసనముగఁ బరిణమించిన తరుణము వృత్తివిరామమున కద నని గ్రహించి, విశ్రాంతి చేకొంటిని.

కళాశాలాదినములనుండియు, సంతతకార్యనిమగ్నతకు నేనభ్యాసపడియుంటిని. నా గురువర్యులగు వీరేశలింగముపంతులుగారి సహవాస సద్భోధనములుకూడ నా కీవిషయమున నమితసహకారు లయ్యెను. సోమరితనము వృధాకాలక్షేపమును నా కాబాల్యశత్రువులు. చదువుచునొ వ్రాయుచునొ, వ్యాయామమందొ, విద్యాపరిశ్రమమమందొ, కర్మకాండలోనొ, జ్ఞానకాండలోనొ, కాలము గడుపుట నా కభ్యాస మయ్యెను. ఇట్లు మెలంగుట నాకు శ్రేయస్కరము నారోగ్యప్రదము నయ్యెను. నా ప్రబలశత్రువులగు దుస్సంకల్పముల నరికట్టుటకును, సత్పథమున సాగిపోవుటకును నా కిదియె పరమసాధన మయ్యెను. ఇంతియకాదు. అంతకంత కీచిరకాలాభ్యాసము నుల్లంఘించుటయె నాకు బాధాకరమయ్యెను. కాలు కదపక, కలము సాగింపక, మనస్సు పరిశ్రమింపక యుండు నిర్బంధవిపరీతవిశ్రమ మెవరికైన శాంతి సౌఖ్యము లొనఁగూర్చినఁ గూర్చుఁగాక. నాకుమాత్ర మది కేవల దుర్భర దుస్థ్సితియె !

దీనికి సంబంధించిన యింకొక సంగతి యిటఁ బ్రస్తావించెదను. చిన్ననాఁటనుండి నేఁటివఱకును ప్రతిదినము చాల దూరము పచేరమునకుఁ బోవుట నా యలవాటు. ఇది కాలుసాగుటకు గాలి పీల్చుటకు నేర్పడిన సాధకవిశేషమె కాదు. భవబాధ లొకింత మఱచి, మనస్సు