పుట:2015.373190.Athma-Charitramu.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 604

భయము చెప్పుటకై నేను 'బూచి' వానిని బిలిచినపుడు బూచివాని కిచ్చివేసెదనని నన్నే వాఁడు బెదరించుచుండెను !

నరసింహము గుంటూరున నుండుదినములలో నేను నా ప్రాఁత దినచర్యపుస్తకములు తిరుగవేయఁజొచ్చితిని. జీర్ణమైపోవుచుండెడి యాపుస్తకములలోని ముఖ్యాంశములు కొన్ని యొక కాకితమున లిఖియించితిని. నా కళాశాలావిద్యాభ్యాసకాలమున వీరేశలింగము పంతులుగారితో ముఖ్యముగ నేను బ్రొద్దుపుచ్చుచుండుటచేత, ఆ కాలపు దినచర్య పుస్తకములు పంతులుగారిని గూర్చిన సంగతులతో నిండియుండెను. నేనేల యీ సందర్భమున వీరేశలింగముగారి సంగ్రహచరిత్రము వ్రాయఁగూడ దని ప్రశ్నించుకొంటిని. వారిచరిత్ర రచనమునకుఁ గడంగు మని నరసింహము నన్నఁ బ్రోత్సహపఱిచెను.

అది కారణముగ నేను పట్టుదలతో పంతులుగారి చరిత్రము వ్రాయఁజొచ్చితిని. పంతులుగారు నాకు వ్రాసినజాబులు, మేమిరువురమును గలసి ప్రచురించిన 'సత్యసంవర్థని', 'జనానాపత్రిక' ల వెనుకటి సంపుటములును నాయొద్దఁ గలవు. "వీరేశలింగసంస్మృతి" నే నంత వ్రాయఁ దొడంగితిని.

ఇంతలో నపుడె కారాగార విముక్తులయిన శ్రీ నాగేశ్వరరావుగారిని నేను బెజవాడ పోయి యొకనాఁడు చూచి, ప్రసంగ సందర్భమున, నేను వ్రాయుచుండు "వీరేశలింగసస్మృతి"ని వారి "భారతీ" పత్రికాముఖమున మాసమాసమును బ్రకటింతురా యని యడిగితిని. వేఱె పుస్తకరూపముననే దానిని బ్రకటింతు మని వారు ప్రత్యుత్తర మిచ్చిరి. అందువలన వేవేగముగ నాపుస్తకమును వ్రాయఁ బూనితిని.