పుట:2015.373190.Athma-Charitramu.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. నూతన పరిస్థితులు 603

నేనును "శారదానికేతన" పరిపాలకులలో నింకొకరగు మంత్రిప్రెగడ సాంబశివరావు గారును చందాలకై నూజివీడు వెళ్లితిమి. అచ్చటి శ్రీ వల్లూరు రాజాగారు కొంత ధనసాహాయ్యము చేయుదుమని చెప్పిరి. నాప్రాఁత నేస్తులగు మరగంటి కృష్ణమయ్యంగారి యింట మేము బసచేసితిమి. బాల్యస్నేహితులు మద్దిరాల రామారావు గారిని గూడఁ జూచితిమి.

వయోవృద్ధులగు మా పెద్దమేనమామ సుబ్బయ్యగారిని జూచుటకై నేనంత ఏలూరు వెళ్లితిని. తొంబది సంవత్సరముల ప్రాయము గల యాయనను కనులు పొరలు తీయించు కొమ్మని నేను ప్రోత్సహించినందుకు మా మేనత్త నవ్వెను. అంత నొక నెలలోనే యాయన చనిపోయెను. ఆయన కర్మాంతరములకు నేను వెంకటరామయ్యయును ఏలూరు పోయివచ్చితిమి. మా మేనమామలలో సుబ్బయ్యగా రతిశాంతచిత్తులు; ఎంతో యోరిమిగల వారు. ముప్పది సంవత్సరముల వయస్సుననుండునపు డీయన కొకపసిబాలిక నిచ్చి పెండ్లిచేసిరి. శాంతస్వభావమునకును, ఋజువర్తనమునకును ఈయన తార్కాణమని చెప్పవచ్చును. సంతతి విషయమునఁగూడ నీయన మిక్కిలి యదృష్టవంతుఁడు. వీరికి నలుగురు కుమాళ్లును, ముగ్గురు కొమార్తెలును. అందఱును బుద్ధిమంతులు.

ఈ సంవత్సరము అక్టోబరులో మా తమ్ముని కుమారుఁడు నరసింహము బి. యలు. పరీక్షనిచ్చి, చెన్నపురినుండివచ్చి, సతీసుతులతో గుంటూరులో మాయింటఁ గొన్ని రోజులుండి, మా కానందము గలిగించెను. ఆతనిపిల్లవానిని నాపేరుతోనే బిలుచుచుండిరి. వానికి మాతమ్ముని దగ్గఱ వలెనే నాయొద్దను మిక్కిలి చనవు కుదిరెను. వానికి