పుట:2015.373190.Athma-Charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 26

ములు బోధించుటకు శర్మగారను నొక నూతనోపాధ్యాయుఁడు చెన్నపురినుండి వచ్చెను. ఆయన యెంతో బుద్ధికుశలతయు నుత్సాహమును గలవాఁడె కాని, శిష్యులయెడ కాఠిన్యముఁ బూనుచుండెడివాఁడు. మా చిన్న లోపములకుఁ బెద్దశిక్షల నొసఁగుచుండును. పాఠశాలలో నింకేయుపాధ్యాయుఁడు నిట్లు మమ్ముఁ బీడించువాఁడు కాఁడు. పట్టణమునుండి యేతెంచిన తాను తక్కిన యుపాధ్యాయులకంటె ప్రజ్ఞావంతుఁడ ననియు, పెద్దజీతకాడ ననియు శర్మ విఱ్ఱవీగుచుండువాఁడు. ఈతని తలబిరుసుతనమెటు లణఁగునా యని తక్కిన యుపాధ్యాయులు తలపోయుచుండిరి.

పదిమంది సహపాఠుల మంతఁ గూడి, పాఠశాలాధికారి కొక విజ్ఞాపనము వ్రాసికొంటిమి. శర్మచర్యలు శర్మచేష్టలును బేర్కొని, యీ నిరంకుశాధికారి యుపాధ్యాయత్వమునుండి మమ్ముఁ దప్పించి, పాఠశాల మంచిపేరు నిలుపుకొనుఁ డని మేము ప్రార్థించితిమి. కాని, యెన్నిదినములకును మామొఱ లాలకింపఁబడలేదు. మా 'యర్జీ బుట్టదాఖ' లయిన దని మే మంత తలపోసి, అధికారులకు మా సంగతి నచ్చఁజెప్పుటకై పాఠశాలకుఁ బోకుండ మేము సమ్మె గట్టితిమి ! పుస్తకములు చేతఁబట్టుకొని పాఠశాలకుఁ జేరువనుండు నొక సావాసునిగదిలో మేము చేరి, మాసమ్మెను గూర్చినమాటలతో దినమంతయుఁ గడపి, సాయంకాలమం దింటికిఁ బోవుచుండుట చేత, పెద్దవారలకు మాసమ్మెనుగూర్చి యంతగఁ దెలియలేదు. సహపాఠులంత మాగదిలోనికి వచ్చి, మమ్మునుగూర్చి శర్మ తరగతిలో బలికెడి కటువుపదములు, తక్కినయుపాధ్యాయుల సానుభూతివాక్యములును, మాకుఁ దెలుపుచుండువారు. మాసమ్మెమూలమున పట్టణమందలి విద్యార్థిలోకమున నెంతయో కలవరము గలిగెను.