పుట:2015.373190.Athma-Charitramu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. అల్లరిచేష్టలు 27

అందఱికంటె నా కెక్కువగా భావోద్రేకము గలిగెను. కొంతకాలముక్రిందట రాజమహేంద్రవరమునొద్ద గోదావరిలో పడవయొకటి మునిఁగిపోయి, జనులనేకులు చనిపోయిరి. ఆ విపత్తును గుఱించి యాంగ్లమున నే నొకపద్యమాల రచియించితిని. ఇపుడీ పాఠశాలలోని యుదంతమునుగుఱించికూడ నింగ్లీషున నొకగీతమాల కల్పించితిని. మాయాగ్రహమునకుఁ బాత్రుఁడైన యుపాధ్యాయుని చేష్టలు గుణములును బేర్కొని, పేరు మార్చి, దుర్గుణములు పెంచి, కథానాయకుని వర్ణించితిని !

ఎట్టకేలకు మావిజ్ఞాపనవిషయమును విమర్శించుటకై పాఠశాలాధికారి పార్షి శ్రీనివాసరావుగారు విద్యాశాలకు వచ్చిరి. పిలుపు రాఁగా, సమ్మెదారుల మందఱమును తరగతిలోఁ బ్రవేశించితిమి. మావృత్తాంతము వా రడుగఁగా, ఎవరికిఁ దోఁచినమాటలు వారము చెప్పివేసితిమి. నావాదమున నుత్ప్రేక్ష లుండుట నాకుఁ దెలియును. మా గురువు క్రూరుఁ డనియు, కఠినచిత్తుఁ డనియు, స్థిరపఱచుటయే నాయుద్దేశ్యము !

మాసాక్ష్యము విని, విజ్ఞాపనవిషయములు విమర్శించుచు, విద్యార్థు లిట్టిఫిర్యాదులలోను, తిరుగుబాటులలోను నుండుట కడు విచారకర మని యధికారి తలంచి, అర్జీ దారులనే దోషు లని నిర్ధారణ చేసిరి. మావాదమును బట్టి మాలో మిగుల పొడుగుగా నుండెడి వాఁడును, మిగుల పొట్టివాఁడును, మొనగాండ్రని యాయన పలికెను. పొడుగాటివాఁడు తణుకు చలపతి; పొట్టివాఁడను నేను. అంతట మే మాఱేసి బెత్తపు దెబ్బలు తింటిమి. కాని, యనతికాలములోనే శర్మగారు మదరాసు పయనము గట్టిరి !