పుట:2015.373190.Athma-Charitramu.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

593


ఆత్మచరిత్రము

చతుర్థభాగము : విశ్రాంతిదశ

1. తొలిదినములు

నేను విశ్రాంతి గైకొనుటకుఁ గొంత ముందుగా శ్రీమతి కమలాభాయి ఛట్టోపాధ్యాయగారు నెల్లూరుపురమునకు విచ్చేసిరి. ఆమె మామేడమీఁదనే విడిసియుండిరి. ఆమె యుపన్యాసము వినుటకుఁ గళాశాలాభవనమునఁ గూడిన మహాసభకు నే నగ్రాసనాధిపతిని. కమలాభాయి తీవ్రమగు వక్త్రియని నే నాసమయమున గ్రహించితిని.

మేము గుంటూరు ప్రవేశించిన దినములలోనె బెజవాడలో నతివైభవమున శ్రీ దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి భవనమున వారి ప్రియపుత్రిక వివాహమహోత్సవము జరిగెను. నా కాహ్వానము వచ్చుటచేత, అచటి కొకనాఁడు పోయి, విందారగించి, పంతులుగారి నభినందించి వచ్చితిని. దినమున కెన్నిసారులో బంతులు తీర్చి వారిపెండ్లిపందిరిలో నతిధులు భుజించుచువచ్చిరి. నాతోఁ గూర్చుండువారె వేయిమంది యుందురు. మా కాసమయమున వడ్డింపఁబడిన పిండివంటలకు మితిలేదు. సాయంకాలము సంగీత సభలు జరిగెను. నాగేశ్వరరావుగారి పేరు దేశమున వితరణమునకుఁ బర్యాయపద మయ్యెను.