పుట:2015.373190.Athma-Charitramu.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 572

నెల్లూరు విద్యాలయమున మొదటి గుమాస్తాగా నుండిన శ్రీ కృష్ణయ్యగారు రాచకురుపువలనఁ జనిపోవుటకు మిగుల విషాద మందితిని.

ఈ పరీక్షా దినములలో నా మనస్సున నొక కథ సంకల్పిత మయ్యెను. అది లిఖించుట కైన నా కీ పరీక్షతొందరలో వ్యవధానము లేకుండినను, ఎటులో తీఱిక చేసికొని, మూఁడు నాలుగు దినములలో నద్దానిని బూర్తి పఱిచితిని. ఇది "రాజేశ్వరి" నవల. మఱుసటి సంవత్సరము దీనిని నెల్లూరులోఁ బ్రచురించితిని.

1926 వ సంవత్సరము జనవరి మాసారంభమున "మండల విద్యాబోధకసమాజ" సమావేశము జరిగెను. ఆ సందర్భమున విద్యార్థుల క్రీడావిశేషములును జరిగెను. ఆ సభలలో జరిగిన చర్చలలో నేను గొంత పాల్గొంటిని.

నే నిదివఱకు కాల్ధరిగ్రామములోఁ గొనిన భూమి కంటియుండు సుమారు అయిదు యకరముల భూమి యమ్మకమునకు రాఁగా, మూఁడువేల రూపాయిలకు, బైగా వెచ్చించి యది నే నిపుడు కొంటిని.

మఱుసటినెలలో మా పినతండ్రి నాగరాజుగారి భార్య వియమ్మగారు కానూరులోఁ జనిపోయిరి. మా పినతండ్రిని చిన్ననాఁడు దాయాదులలో నొకరు పెంచుకొనిరి. వివాహితుఁ డైన పిదప యౌవనముననే యాయన మా తండ్రితోపాటు కర్నూలు ప్రాంతములకుఁ బోయి, అచట లోకాంతరగతులయిరి. ఆయన యాస్తిని జిరకాలము వియ్యమ్మగా రనుభవించి యిపుడు చనిపోయిరి. మేమె వారి ముఖ్య వారసులము. పురుషవారసు లందఱిలోను పెద్దవాఁడ నగుటచేత నేనె యామె యపరకర్మలు నెల్లూరులో