పుట:2015.373190.Athma-Charitramu.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. శుభాశుభములు 573

నిపుడు జరిగించితిని. బ్రదికియుండు కాలమున నామె మాయం దంతగ ననురాగము లేక, తన మేనకోడలియొద్ద నివసించి, వారి కుటుంబమును బోషించుచువచ్చెడిది. వియ్యమ్మగా రెవరిని దత్తు చేసికొనక చనిపోయినను, మేనకోడలును ఆమె భర్తయును దమ కుమారుని వియ్యమ్మ పెంచుకొనె నని ప్రతీతి కల్పించి, ఆమె భూములను స్వాధీనపఱచుకొనుటచేత, సోదరులము మువ్వురమును మా పెత్తండ్రుల కుమాళ్లు మువ్వురునుగూడి, వారలమీఁద వ్యాజ్యెము వేసితిమి. నేను మా సోదరులతో నీ తరుణమున రేలంగి వెళ్లి రాజీ విషయమై చేసిన కృషి విఫల మగుటచేత, న్యాయస్థానమున కేగ వలసి వచ్చెను.

నా భార్యయు, ఆమెయన్నయును తమచెల్లెలి కుమారుఁడు కృష్ణారా విపుడు ఉద్యోగము చేయు శ్రీహరికోటగ్రామము పోయి, అచటఁ గొన్నిదినములు నివసించి వచ్చుటచేత, వారిరువురకు నంతట మన్యపుజ్వరము సోఁకి, కొంతకాలము వారిని బీడించెను. నాకును రమ్మని యాహ్వానము వచ్చినను, కళాశాలాకార్యములు నెపముగఁ జేసికొని, నే నీవ్యాధిబారినుండి తప్పించుకొంటిని.

మామఱఁదలు చెన్నపురిప్రయాణము గట్టి వచ్చినను, ఆమె హృద్రోగము నెమ్మదిపడలేదు. అంతకంతకు వ్యాధి ముదిరి, యామె యా మేనెలలో భీమవరమున లోకాంతరగతయయ్యెను. మరణసమయమునఁ దన మువ్వురు పుత్రులు పుత్రికయును జెంతనుండుటవలన నామె కొంత చిత్తశాంతి నందినను, కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తన తనయుల యభ్యున్నతిని గనులారఁ గాంచ నోఁచికొననైతినని యామె కొంత వ్యాకులతఁ జెందెను. ఇఁక నడివయస్సున ప్రియపత్నీ వియోగము సంభవించి, కుటుంబపరిపోషణాభారమంతయు శిరమునఁబడిన