పుట:2015.373190.Athma-Charitramu.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 568

క్యము" నం దభిమానము మెండు. అది యిందలి కథలలోనె కాదు, నేను వ్రాసిన కథ లన్నిటిలోను నుద్రిక్తభావవర్ణన విషయమున ప్రథమగణ్య మని భావించువాఁడను.

ఈ "చిత్రకథామంజరి" ప్రథమభాగమును నా గురువర్యులగు వీరేశలింగముపంతులుగారికిఁ గృతి యిచ్చుట యుక్త మని తలంచి, యీ క్రింది పద్యమున వారి కది యంకితము చేసితిని.

                       తే. "గద్య తిక్కన సంఘసంస్కర్త ఘనుఁడు
                            కోవిదుఁడు రావుబహద్దరు గురువు మాకు
                            కందుకూరి వీరేశలింగ కవిమణికి
                            నంకిత మొనర్తు నీగ్రంథ మధికభక్తి."

ఈ పుస్తకము ముద్రణాలయమునుండి వెలువడఁగనే, మిత్రులు శ్రీ గిడుగు రామమూర్తిగారి కొక ప్రతి నంపితిని. అది చదివి వా రానందించి, కొలఁది కాలములోనే సమావేశమైన చెన్నపురి విశ్వవిద్యాలయాంధ్ర పాఠ్యపుస్తక నిర్ణయసభలో దానినిగుఱించి చెప్పిరి. ఆ తరుణముననె సభాధ్యక్షులు వెంకటరంగారావుగారు నా "హిందూసుందరీమణులచరిత్రము" ల 1, 2 భాగములను గుఱించి ప్రస్తావించిరఁట. కావున 1928 వ సంవత్సర మందలి ఇంటరుమీడియేటు పరీక్ష కీ మూఁడుపుస్తకములును పాఠ్యగ్రంథములుగ నియమింపఁబడెను. విశ్వవిద్యాలయ పాఠ్యగ్రంథ నిర్ణయసభవారి యనుగ్రహ మెపుడును జవిచూడని నన్నీ యెదురుచూడని మే లమితానందభరితునిగఁ జేసెను.