పుట:2015.373190.Athma-Charitramu.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 546

ఆయనకు జబ్బుచేసెను. కొంతనెమ్మది పడినపిదప, నే నాయనను విడిచి, అమలాపురము రాజమంద్రి తాలూకాలలో కొన్నిగ్రామములు పోయి, పంతులుగారినిమిత్తమై కృషి సలిపి, గుంటూరు తిరిగివచ్చితిని. వెంకటప్పయ్యగా రంతట చట్టనిర్మాణసభ్యులుగ నెన్ను కొనఁబడిరి.

గృహప్రవేశ మైతి మనుమాటయె కాని, మా ప్రహారిగోడయు, నింటికిటికీల తలుపులు మున్నగునవి యెన్నో యింకను పూర్తి కాలేదు. అందువలన పిమ్మట కొన్ని నెలలవఱకు నింటిపనినుండి మాకు విరామము కలుగదయ్యెను.

1919 మెయి 27 వ తేదీని ఆంధ్రదేశ నాయకమణి యగు కందుకూరి వీరేశలింగముపంతులుగారు మద్రాసునఁ గాల ధర్మనొందిరి. వారి గౌరావార్థమై గుంటూరిలో నంతట జరిగిన సభలలో నేను బాల్గొని, దేశోద్ధరణమునకై పంతులుగారు చేసిన కార్యముల నుగ్గడించితిని. "హితకారిణీసమాజము" వారు జులై నెలలో రాజమంద్రిలో పంతులుగారి గౌరవార్ధమై జరిపినసమావేశములకు నేను బోయితిని. ఆమహామహుఁడు తలపెట్టిన సత్కార్యములు కొనసాగించుటయె యాయన నుచితరీతిని గౌరవించుట యని నేను జెప్పితిని.

ఆగష్టునెలలో బెజవాడలో జరిగిన "సహకార సంఘ" సభలకు నేను బోయియుండునపుడు, "హిందూదేశసేవక" సమాజ సభ్యులగు శ్రీవెంకటసుబ్బయ్యగారు నాకుఁ బరిచితులయిరి. వారి యొక్కయు, వెంకటప్పయ్యగారియొక్కయు కోరిక ననుసరించి నేను వీరేశలింగముపంతులుగారినిగూర్చి యొక యాంగ్లవ్యాసము వ్రాసి,