పుట:2015.373190.Athma-Charitramu.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22. గృహప్రవేశము 547

పైసమాజమువారి "హిందూదేశసేవికా" పత్రికలోఁ బ్రచురించితిని. నావ్యాసము ఆపత్రిక ఆగష్టు 28 వ తేదీ పత్రికయందును, మఱుసటి వారపత్రికయందును బ్రకటింపఁబడెను.

నా యాంగ్లవ్యాసమునందలి ముఖ్యాంశము లిందుఁ బొందుపఱుచుచున్నాఁడను : - "ఆధునికాంధ్రజనులలో నగ్రస్థాన మలంకరించి, ఆర్ధశతాబ్దకాలము దేశసేవ లొనరించి ధన్యులైన పంతులుగారు మేధావంతులు, కార్యశూరులు, సాహిత్య విశారదులు, సంఘ సంస్కార వేత్తలును. వితంతువివాహ సంస్కరణమును ఆంధ్రావనిని ప్రప్రధమున నెలకొల్పిన ధైర్యశాలులు. తన కెన్ని కష్టము లాపాదిల్లినను పట్టినప్రతిన విడువక, ఆంధ్రజనుల హృదయ సీమల యందు సంస్కరణాభిమానబీజముల నాఁటిన మహనీయులు. నవీనాంధ్రవాఙ్మయమున కీతఁడు సృష్టికర్త. సాంఘికవిషయములం దీతఁడు సాధింపని సంస్కరణవిశేషము లేనెలేదు. ఆంధ్రదేశ మాతకు వీరిరచనములు, వీరి సౌశీల్యసచ్చారిత్రములును నెనలేని భూషణములు."

గుంటూరు ప్రార్థనసమాజమున కని నేను కొనిన వెనుకటి స్థలమున కంటియున్న స్థలము నొక దానిని డిశెంబరులో కొంటిని. ఇట్లు నేను ఒకవేయిరూపాయిలు కర్చు పెట్టితిని. దీనికై మిత్రులు కొందఱు చందాలిచ్చిరి. కాని, యామొత్తములు మిగుల స్వల్పమగుటచేత, అంత వ్యయమును నేనె వహింపఁబూని, ఎవరిచ్చినసొమ్ము వారి కిచ్చివేసితిని.

మా నూతనగృహమునఁ జేరియుండు విశాలమగు పెరటిలో నీసంవత్సరమున వివిధజాతుల దోసకాయలు కాచినవి. అవి మే మను