పుట:2015.373190.Athma-Charitramu.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 530

వేసవిని గడపవచ్చిన కందుకూరి వీరేశలింగముపంతులుగారిని జూచి, వారివలన నొక యుత్తరము పుచ్చుకొని, 18 వ తేదీని నేను మైసూరునగరము చేరితిని. మైసూరువారు మైసూరుబోధకులకె ప్రోత్సాహము గలిగింపఁబూనిరి గాన, అచట నా కేమియు లాభము గలుగలేదు. మైసూరుకంటె బెంగుళూరె యారోగ్యప్రదముగఁ గాని పించెను. కాని, యీ సంవత్సరమున బెంగుళూరికంటె గుంటూరె చల్లగ నుండునట్లు తోఁచెను.

నేను గుంటూరు తిరిగివచ్చిన మఱునాఁడె మాచిన్నపిల్లవాని స్మారకదినము. వానినిగుఱించి తలపోయుచు మేము సంతాపజలధిని మునిఁగిపోయితిమి. నన్నోదార్చుటకై హనుమంతరావుగా రానాఁడు తమ ప్రయాణమును మానుకొనిరి. దు:ఖపరవశుఁడనగు నన్నాయన కలక్టరు కచేరిలో శిరస్తాదారగు మిత్రులు వడ్లమూడి బ్రహ్మయ్య పంతులువారియొద్దకుఁ గొనిపోయిరి. వారు నాకు హితోపదేశము చేసిరి. పిల్ల వాని జ్ఞాపకార్థముగ బీదలకు అన్న దానము చేసితిమి.

ఆ నెల 29-30 తేదీలలో రేపల్లెలో గుంటూరు మండలసభలు జరిగెను. నేను సంఘసంస్కరణసభలోఁ గొంత పాల్గొంటిని. ఆసభకు ఉన్నవ లక్ష్మీనారాయణగా రధ్యక్షులు. పూర్వము దక్షిణ హిందూదేశమున శైవమతవ్యాపనము చేసిన బసవేశ్వరునికాలము నుండియు ఆంధ్రులు సంఘసంస్కరణాభిముఖులని వీరు చెప్పిరి. మెయి 31 వ తేదీని కొండ వెంకటప్పయ్యగారు నెల్లూరిలో జరుగు ఆంధ్రరాష్ట్రీయసభలకు సకుటుంబముగ బయలుదేఱుచు, మాదంపతు లిద్దఱి నాహ్వానింపఁగా, మేమును నెల్లూరికిఁ బయనమయితిమి.