పుట:2015.373190.Athma-Charitramu.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 500

నాఁడు మేడ డాబామీఁద నేను గూర్చుండి చదువుకొనుచుండఁగా, భార్య నాచెంత నెండవేసిన చీరను కోఁతియొకటి మెల్లగఁ బట్టుకొని పాఱిపోయెను. తనకు లాభములేని పనులలోఁ బ్రసక్తి ప్రమోదములు గలిపించుకొనుట యనుదుర్గుణము, నరునిజూచి వానరముగ్రంహిచెనా, వానరమునుండి నరునికి సంక్రమించెనా యని నే నాశ్చర్యమందితిని !

కాశినుండి మేము ప్రయాగ వెళ్లితిమి. గంగాయమునా సంగమ ప్రదేశ మత్యంత రమణీయముగ నుండెను. అచట మిగుల పెద్ద తాఁబేళ్లను జూచి యాశ్చర్య మందితిమి. అ పురమందలి యాంధ్రప్రముఖు లగు శ్రీ చింతామణిగారి వొకనాఁడు సందర్శించి వచ్చితిని. వారు నాకు మద్రాసులో పరిచితులు. తమిళులు మున్నగు పొరుగు జనులతో నాంధ్రులు పోటీచేసి గౌరవస్థానము గడించుట కర్తవ్యమని వారు చెప్పిరి. మే మంతట గృహోన్ముఖుల మైతిమి. దీపావళినాఁడు మేము తిరుగుపయనము చేసితిమి. రాత్రి యంతయు పంజాబుమెయిలు వాయువేగమునఁ బరుగులెత్తెను. దారిపొడుగునను దీపములచే నలంకృతముగాని రెయిలు స్టేషనుగాని, పట్టణపక్కణములు గాని మాకుఁ గానుపింపలేదు. దీపావళి హిందూజాతికంతకును ప్రధానమైన పండుగయని మా కానాఁడు దృగ్గోచర మయ్యెను !

1915 ఫిబ్రవరిమాసాంతమునకె నా కళాశాల చదువు సంపూర్తి యయ్యెను. సకుటుంబముగ నే నంత గుంటూరువచ్చి వేసితిని. నా పుస్తకములు సామానులును వేసియుండు కొట్టు తాళము తీసి చూడఁగా, ఒక బీరువా చదులు పట్టిపోయెను. విలువగల నా వెనుకటి రచనముల వ్రాఁతప్రతులు, పత్రికా సంపుటములు కొన్నియును చదపురుగుల కాహార మయ్యెను.