పుట:2015.373190.Athma-Charitramu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

వేకువనే రేలంగి నడిచి వచ్చి, పాఠశాల నడుపుచుండెడివారు. పెద్దతరగతులపాఠములు, ముఖ్యముగ నింగ్లీషుభాషయు, ఈయన బోధించుచుండెడివారు. రేలంగినివాసులగు కందిమళ్ల సుబ్బారాయుఁడుగారు సహాయోపాధ్యాయులు. వీరు ఖచితముగ నాంధ్రము గఱపుట యందును, శిష్యుల నదుపులో నుంచుటయందును ప్రసిద్ధి నొందిరి. ఉపాధ్యాయు లిరువురును సామాన్యముగ నొకరితో నొకరు సంప్రదించి సంభాషింప కుండెడి సఖ్యవిశేషమున నొప్పుచుండువారలు. ఆప్రదేశమందలి నా సహాధ్యాయులను గూర్చియు వారి చర్యలనుగుఱించియు కొంత చెప్పవలయును. దేశమున నింగ్లీషువిద్య యంత ప్రాచుర్యము కాని యాకాలమున, పాఠశాలలో నాంగ్లేయభాష నేర్చుచుండుటకే మిడిసిపడుచుండెడివారము. ఐనను, వేషభాషలందును, అభిరుచులందును మేము వట్టి జానపదులవలెనే సంచరించెడివారము. ఆటపాటలవిషయమున పట్టణములఁగల సౌకర్యములు మాకు లేకపోవుటవలన, ఉప్పట్లు, చెడుగుడి, దూళిబంతి, గూటీబిళ్ల మొదలగు ప్రాఁతయాటలనే మే మంటిపెట్టుకొని యుంటిమి. సెలవుదినములలో మే మొకచోటఁ జేరి, యుద్యోగస్థులవేషములు వేసి నాటకము లాడి, వినోదింతుము. ఒక్కొకతఱి పొలములోనికిఁ బోయి నేరెడుచెట్లెక్కి, నల్లనిపండ్లు కోసి, యింటినుండి తెచ్చినయుప్పు కారములపొడిలో నవి యద్ది భుజింతుము. మే మెంత జాగ్రతపడినను, నాలుక నల్లబడి గొంతుకు బొంగుపోయి, కొన్ని దినములవఱకును దగ్గుపడిసెములకు లోనై, మేము తలిదండ్రుల తిట్లకు తల లొగ్గుచుందుము. అప్పుడప్పుడు వీథులలో నాడెడి భాగవతము, జలక్రీడలు, తోలుబొమ్మలును, మా కమితాహ్లాదకరములుగ నుండి, కొన్నాళ్లవఱకును మా చిన్ని యాటల కొరవడు లగుచుండును. మా రెండవ