పుట:2015.373190.Athma-Charitramu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 452

నాప్రయత్నముల సంగతి వారికేమియుఁ దెలియకుండఁగనె, ఈ యుద్యోగమై నేను విజయనగరము వెళ్లుచున్నానని వారు వినిరి. 14 - 8 - 1904 తేదీని మాతమ్ముఁడు కృష్ణమూర్తి నాకు వ్రాసిన లేఖలో, "నీకు విజయనగరమున నుద్యోగమయినదని వినుటకు నేనమితానంద మందితిని. ఇంతత్వరలో నీకిట్టి భాగ్యము గలుగునని యెవరము ననుకొనలేదు. ఇపుడు నీకు దొరతనమువారి కొలువు సులభముగ లభించును. క్షేమముగ నీ వీపాటికి విజయనగరము ప్రవేశమైతివని యెంచెదను. * * *" అని యుండెను. ఆనెల 10 వ తేదీని వెంకటరామయ్య యిట్లువ్రాసెను : - "నీ 8 వ తేది యుత్తరము మమ్మందఱి నాశ్చర్యమగ్నులఁ జేసినది. మహారాజావారి కళాశాలలో నీ కీ యుద్యోగము లభించినందుకు మేమందఱము సంతస మందుచున్నాము. ఈమార్పు రెండువిధముల మంచిది. నీవు నూఱుమైళ్లుదగ్గఱ పడితివి. నీ కున్నతపదవి లభ్యమయ్యెను. లాభముతోపాటు నీ బాధ్యతయు పెరుఁగుచున్నది. బి. యె. తరగతులకు తర్కము, యఫ్. యేకు ఆంగ్లమును జెప్పుట సులభముకాదు. * *" నాప్రియ గురువులగు స్కాటుదొరగారు, "నీకు విజయనగరమున నుద్యోగమైనందుకు నాకెంతో సంతోషము. ఉన్నత పాఠశాలలోను, రెండవతరగతి కళాశాలలోను గల నానారీతులగు పనికంటె మొదటి తరగతి కళాశాలలో పనియె సంతోషకరము. నీపనిలో చాలభాగము బి. యే తరగతులతోనే యున్న దనుకొందును. నీయుపన్యాసములు సిద్ధము చేసికొనుట మొదట కొంచెము ప్రయాసకర మైనను, దారిని పడినపిమ్మట నీ కంతయు సులువగను. విజయనగరము కళాశాల స్థిరసంస్థయె. నీపని తృప్తికరమైనచో, కాలక్రమమున నీవా కళాశాలాధ్యక్షకపదవి నందఁగలవు, కావున నీకు దొరతనమువారికొలువు సమకూరకున్నను,