పుట:2015.373190.Athma-Charitramu.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. "జనానా పత్రిక" 453

నీభవిష్యత్తున కేమియు వ్యాఘాతము రానేరదు. * * *" అని వ్రాసిరి.

"జనానాపత్రిక" ప్రచురణవిషయమై కూడ నాకు వెనుకటికంటె నెక్కువ సదుపాయము గలిగెను. నేను విజయనగరము వచ్చిన మఱుసటి నెలనుండియె వీరేశలింగముగారు జనానాపత్రికాధిపతులలో నొకరైరి. ఆయన యిటీవలనే ప్రభుత్వమువారి కొలువునుండి విశ్రాంతి గైకొనిరి. నాతోఁగలసి స్త్రీవిద్యాభివృద్ధికొఱకై యేర్పడిన జనానాపత్రికకు సంపాదకునిగ నుందునని యాయన చెప్పినందున, నేనెంతో సంతోషమున దానికి సమ్మతించితిని. కావున 1904 సంవత్సరము సెప్టెంబరునుండియు 'జనానాపత్రిక' కిరువురమును సంపాదకులముగనుంటిమి. ఆయన యాలోచన ననుసరించి, పత్రిక చందా రెండు రూపాయిలనుండి రూపాయికి తగ్గించితిని. ఇపు డాయన "భౌతిక భూగోళశాస్త్ర సంగ్రహము", "విదేశనారీమణుల చరిత్రము" లను 'జనానాపత్రిక' లోఁ బ్రచురింప మొదలిడిరి. పత్రికయెంతో శోభా యుక్తమయ్యెను. కాని, వీరేశలింగముగారి కలము ప్రహసనముల మీఁదికిఁ బరుగులెత్తుచుండెడిది ! మా యిరువురి సంపాదకత్వమునను పత్రిక వెలువడ నారంభమైన రెండవనెలలోనే, "సావిత్రీ సత్యవతీ సంభాషణము" అను స్త్రీవిద్యను గుఱించిన ప్రహసన మొకటి వారు వ్రాసిరి. దానిలో స్త్రీవిద్యావ్యాపనమును గుఱించి యిటీవల బయలు వెడలిన "సావిత్రీ" "హిందూసుందరుల" లోని వ్రాఁతలను గుఱించి యాక్షేపణము లుండెను. స్త్రీలపేరు పెట్టుకొని పురుషులు పత్రికలలో వ్రాయుట యసమంజస మనియే వాని భావము. ఈవిషయమై రెండుమూఁడు సారులు నేనును నాపత్రికలో మొఱపెట్టితిని. కాని, యీమాఱు ప్రహసనరూపమున బయలుదేఱిన పంతులుగారి తీవ్ర