పుట:2015.373190.Athma-Charitramu.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 450

రెండవతరగతి కళాశాలయె. విజయనగరమునందలిది మొదటితరగతి కళాశాల. అచటి కళాశాలతరగతులందే నేను బోధింపవలయును. ఇది నాకెంతయు సంతోషదాయక మగు కార్యము. కాని, విజయనగరమున జీతముమాత్రము తక్కువగ నుండెను. కావున హెచ్చుజీత మిచ్చిన నే నాయుద్యోగముఁ జేకొందునని విజయనగరమునకు తంతి నిచ్చితిని. ఆయుద్యోగమునకుండు నత్యధికమగు జీతము 120 రూపాయిలు నిపుడే యిచ్చితి మని నాకు మాఱుతంతి వచ్చెను. కావున నే నాయుద్యోగమును స్వీకరించితిని.

ఆగష్టునెల మధ్యనే నేను పర్లాకిమిడి విడిచి, విజయనగరము పోవలయును. నాప్రయాణవార్త పర్లాకిమిడి విద్యార్థుల కమితవిషాదము గలిగించెను. ఇటీవలనే నే నిచ్చటివిద్యార్థులలో "సంఘపారిశుద్ధ్య సమాజము" నొకటి నెలకొల్పితిని. పొగాకు, మద్యపానము మున్నగు నుద్రేకజనకపదార్థములు దరికిఁ జేరనీయక, మనో వాక్కాయ కర్మల యందు పవిత్రత దాల్చియుండవలె నను నియమమును ప్రతిసభ్యుఁడును పూనవలెను. ఈ ప్రదేశమున సామాన్యముగ పెద్దలు పిన్నలును పొగాకు "కిల్లీలు" సదా నమలుచుందురు. అట్టి యభ్యాసము నరికట్టుట దుర్ఘటము. ఐనను. నా ప్రోత్సాహమున త్వరితకాలముననే విద్యార్థు లనేకు లీ సమాజమునఁ జేరిరి. ఉపాధ్యాయులును గొందఱు పొగాకు విసర్జించివేసిరి. దినమున కొక చుట్టమాత్రమే తా మిపు డుపయోగించుచుంటిమని గిడుగు రామమూర్తిపంతులుగారు నాకుఁ జెప్పిరి. ఎపుడును దౌడను కిల్లీ నుంచుకొనెడి యలవాటుగల కళాశాలాధ్యక్షులు శ్రీనివాసరావుగారు, కిల్లీ యిపుడు పూర్తిగ విసర్జించి, దంతముల తీపు శమించుటకై కిల్లీకి మాఱుగ సొంటికొమ్మును బుగ్గను బెట్టుకొనిరి.