పుట:2015.373190.Athma-Charitramu.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. సుఖదినములు 449

కాని, తాత్కాలికానంద మొకటియే నిరతము మన జీవితమును నడుపుచుండెడి శక్తివిశేషము కాదు. నాకిపుడు బాగుగ జరిగిపోవు చుండుట వాస్తవమె కాని, ముం దెపుడును నే నీ మాఱుమూలదూర ప్రదేశమందలి చిన్న కళాశాల నంటిపట్టుకొని యుండవలసినదేనా ? నా సోదరులు బంధువులు నుండు గోదావరి మండల మిచటికి వందల కొలఁది మైళ్లదూరమున నున్నది. సంవత్సరమునకు రెండు మూఁడు మాఱులు నేను స్వస్థలమునకుఁ బోయి వచ్చు చున్నచో, "లంక మేఁతం యేటియీఁత" యనునట్లు నాసొమ్ము రెయిళ్లపాలు కావలసినదే ! ఇటీవల రెండు మూఁడుసారులు నే నిచట మన్యపుజ్వరమువలన బాధపడితిని. ఎల్లప్పుడు నన్నీప్రదేశ మాకర్షించు ననుటకు, ఇది నాజన్మస్థల మైనఁగాదు! ఇదిగాక, నాకు లభించినతోడనె మటుమాయమైన దొరతనమువారి కొలువునుగూర్చి యింకను నామనస్సు మెర మెరలాడుచుండెను. దానికొఱకు మరల మరల నే నిటీవల ప్రయత్నించినను, నాకృషి సఫలముకాలేదు. ఇటు లుండఁగా, ఒక విజయనగరపు మిత్రుఁడు, అచటి మహారాజావారి కళాశాలలో నాంగ్లోపన్యాసక పదవి ఖాళీ యయ్యె నని యొకనాఁడు నాకుఁ జెప్పెను. విజయనగరము స్వదేశము గాకున్నను, పర్లాకిమిడికంటె దానికిఁ జేరువతావెగదా. నేనంత నొక దరఖాస్తునంపి, సిఫారసు చేయుఁడని పరీక్షాధికారికి వ్రాసితిని. ఎవరి మొగ మెఱుకయు లేని విజయనగరమున నాకే లాభమును గలుగు నని నే నాశింప లేదు.

జూలయినెలలో నొకనాఁటి రాత్రి నాకొక తంతి వచ్చెను. అది విజయనగరము కళాశాలాధ్యక్షునియొద్దనుండియే. నాకుఁ దమ కళాశాలలో ప్రథమ సహాయోపన్యాసక పదవిని 110 రూపాయిల జీతముమీఁద నిచ్చితిమని యం దుండెను. పర్లాకిమిడి కళాశాల