పుట:2015.373190.Athma-Charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. గోపాలపురము 9

గాలు నిలువక చెంగుచెంగునఁ బెత్తనములకుఁ బరుగు లిడు నాకును సఖ్యము సమకూరకుండుటచే, బయటిసావాసులే నాకు శరణ మగుచుండిరి. ఎప్పుడును ఏవింతలో చూచుచును, ఏవార్తలో వినుచును, ఏపనియో చేయుచును నుండినఁగాని నాకుఁ బ్రొద్దు పోయెడిదికాదు. సుజనులో దుర్జనులో సావాసులతో నుండుటయె నా కప్పటి యభ్యాసము ! చెలికాండ్ర చెలిమి గోరువారికి విరోధులతోడి వైరము కూడ నేర్పడుచుండును. ఇదిగాక, సదా మిత్రులతోఁ గలసిమెలసి యుండువాఁడు, సమయానుగుణ్యముగఁ దాను వారిని నాలుగు కొట్టుటయు, వారిచే నాలుగు పడుటయును సామాన్యముగ సంభవించుచుండును. శైశవదశ నుండు నా పెద్దతమ్ముని కీ స్నేహసారస్య మేమియెఱుక ? చీటికి మాటికి నేను జేయు చిన్న దండయాత్రలలో నన్ను వాఁడు చేరఁగోరి, వల్లె యనినను వల దనినను నాపాలిఁటి విధి దేవతవలె నన్ను వెన్నాడుచు, సమీపించినచోఁ దన్ని పోవుదు నను భయమున దూరమున నుండియే వాఁడు మా చిన్న కలహముల నుపలక్షించి, నా యుద్ధకౌశల మావంతయు మెచ్చుకొనక, నా జయాపజయము లైన బాగుగఁ బరిశీలింపక, వాయువేగమున నింటికిఁ జని, మహాప్రసాద మని యా వార్త తలిదండ్రులకు నివేదించుచుండువాఁడు ! అంత మా నాయన యింట నుండినచో, నా కానాఁడేదియో మూఁడినదే ! శత్రుని పిడికిలి పోటులు శరీరమున శమింపకమున్నే, పండ్లు కొఱికి వచ్చెడి పితరుని తాడనపీడకు మరల నా దేహము తావలము గావలసినదే ! ఒక్కొకప్పుడు పలాయితు లగు శత్రుమిత్రులును నా వలెనే మా జనకుని యాగ్రహానలమున కాహుతి యగుచుందురు.

నా కానాఁడు లభించిన యొక సావాసుని గుఱించి యిట నొకింత ప్రస్తావింపక తీరదు. ఆతఁడు నాకంటె నైదాఱేండ్లు