పుట:2015.373190.Athma-Charitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

పెద్దయై, పొడుగుగ నుండెడివాఁడు. అ గ్రామనివాసియు ననుభవశాలియు నగు వానివాక్కులు నాకు వ్యాసప్రోక్తములు! నీట రాళ్లు రువ్వి కప్పగంతులు వేయించుట, కొయ్యతెరచాప లమర్చిన కాకియోడలను ప్రవాహమున కెదురుగ నడిపించుట, మా పెంపుడుకుక్కను రాజుగారి సీమకుక్కమీఁద కుసికొలిపి దానిని గఱిపించుట, - ఇవి నా కనులు మిఱిమిట్లు గొనునట్టుగ నా మహనీయుఁడు దినదినమును ప్రదర్శించెడి విచిత్రవ్యాయామములు! అట్టి మేటినాయకుని నూఁతగఁగొని, వాని యడుగుజాడలనే నడువఁబూనుటయం దేమి యాశ్చర్యము? నేను విశ్వసించెడి రామరావణులు వట్టి క్షుద్రు లనియు, వీరికి మిన్న యగి వేలుపు గలఁ డనియు నతఁడు సూచించి, నాచెవులు చిల్లులు పడునట్టుగ నతని పేరు "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుఁ" డని నుడివినపుడు, నే నెట్లు వానిని గౌరవింపకుందును? ఇతఁడు వేవేగమే నాకు మార్గప్రదర్శకుఁడును నయ్యెను! పొగచుట్టయొక్క ప్రాశస్త్య వర్ణన మాయనయొద్ద నేను విని, అద్దాని కర్మకాండవిషయమై యాతనియొద్దనే మంత్రోపదేశముఁ గైకొంటిని. అంత మూఁడుదినముల వఱకును నే నేమి తినినను త్రాగినను, వమనము చేసికొనుచు వచ్చితిని. ఇట్టికష్టముల కోర్చి పట్టువిడువక యలవాటు చేసికొనినచో, చుట్ట కాల్చుటయందు తనవలెనే నే నాఱితేఱి సుఖింతు నని యతఁడు నా కుద్బోధించెను. కాని నా యీ నూతనవిద్యారహస్యము, మా తమ్ముని వలన విని, మా తల్లి యానాఁడు త్రాటితోఁ గొట్టిన దెబ్బలు, అర్ధశతాబ్దము గడచినవెనుకఁగూడ నా వీపున చుఱ్ఱు మనుచునే యున్నవి. చుట్ట గాని, దాని చిన్ని చుట్టము లెవ్వి గాని పిమ్మట నెపుడును నా దరిచేరకుండుట యందలి రహస్యము, బాల్యమం దానాఁడు మా జనని ప్రయోగించిన దివ్యౌషధప్రభావమె యని నేను బలుమారు తలపోసితిని!